సన్నిధి యాదవులకు వంశపారంపర్య హక్కు కల్పించడం హర్షణీయం అని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారని తెలిపారు. చట్టంలో సన్నిధి యాదవులని మార్చినందుకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. 1996లో టీడీపీ ప్రభుత్వం తొలగించిన వంశపారంపర్య విధానాన్ని సీఎం జగన్ అమలు చేశారని.. ఆయన కేబినెట్‌లో మంత్రిగా ఉండటం ఆనందంగా ఉందన్నారు. సీఎం జగన్‌ చేసిన మేలు ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. 

గతంలో సన్నిధి గొల్లలకు ఐదువేలు ఇచ్చేవారని, వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి సమస్యలు తెలుసుకుని 18 వేలు పెంచారని తెలిపారు. టీటీడీలో వంశపారంపర్యం గా హక్కు ఇవ్వడంతో రాష్ట్రంలోని యాదవులంతా సీఎం జగన్‌కు రుణపడి ఉంటామన్నారు. ఇన్నేళ్లు తర్వాత వారికి మంచి చేసిన నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌ ఒక్కరేనని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు.