నెల్లూరు, డిసెంబర్‌ 26, (రవికిరణాలు) : రాష్ట్రంలో ఒక్కో రంగాన్ని నిర్వీర్యం చేస్తూ వస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి కన్ను ఇప్పుడు ప్రభుత్వ పవర్ ప్రాజెక్టులపై పడిందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన బుధవారం సాయంత్రం నెల్లూరు టిడిపి కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్ తోకలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పీపీఏలపై సమీక్ష పేరుతో సంప్రదాయ విద్యుత్ వనరులైన సోలార్, విండ్ పవర్ రంగాల్లో గందరగోళం సృష్టించారని, ఆ తర్మాత థర్మల్ పవర్ ను కూడా బ్రష్టుపట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.1986కి ముందు రాయలసీమ జిల్లాల్లో విద్యుత్ సరఫరా సమస్య తీవ్రంగా ఉండేదని, లోఓల్టేజీ కారణంగా ట్యూబ్ లైట్లు వెలగని పరిస్థితి నెలకొని ఉండేదన్నారు.
రాయలసీమలో ఓల్టేజీ సమస్యను సమూలంగా పరిష్కరించేందుకు 1986లో ఉగాది పర్వదినం నాడు ఎన్టీ రామారావు 1650 మెగావాట్ల సామర్థ్యంతో రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టిపిపి)కి శ్రీకారంచుట్టడం  జరిగిందన్నారు. ఆర్టీపీపీలో విద్యుత్ ఉత్పత్తి ఖర్చుతో కూడిన వ్యవహారమైనప్పటికీ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లారని చెప్పారు.
ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధపెట్టి
కొనసాగించారని వెల్లడించారు.రాయలసీమలో ఒక ప్రధాన ప్రాజెక్టు అయిన ఆర్టీపీపీని ఇప్పుడు ఎన్‌టిసిపికి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.
మరోవైపు నెల్లూరు జిల్లాలోని నేలటూరులో ఉన్న ఏపీ జెన్ కో పవర్ ప్రాజెక్టును కూడా ప్రైవేటు పరం చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు అనుమానం కలుగుతుందన్నారు.తక్కువ మానవశక్తితో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ప్రాజెక్టుల్లో నేలటూరు ప్రాజెక్టు ఎన్టీపీసీ కంటే ముందుందన్నారు. . ఈ ప్రాజెక్టును ఆ పక్కనే ఉన్న సెంబ్ కార్ప్,  లేక అదానీ కంపెనీకో అంటగట్టేలా వైసీపీ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ఉందని ఆయన దుయ్యబట్టారు.
ఆర్టీపీపీ కానీ, ఏపీ జెన్ కో ప్రాజెక్టు కానీ వ్యాపార సంస్థలు కావని అవి సేవా దక్ఫథంతో పని చేసే ప్రభుత్వ రంగ సంస్థలన్నారు. ఆనాడు నార్ల తాతారావు, పార్ధసారధిలను సలహాదారులుగా పెట్టుకుని విద్యుత్ వ్యవస్థను నడిపించారని చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం  విజయవాడలోని వీటీపీఎస్ దేశంలోని నెం 1 స్థానంలో ఉందని, ఆర్టీపీపీ కూడా అనేక అవార్డులు అందుకుంటుందన్నారు. తమిళనాడు ప్రభుత్వం సుదూర ప్రాంతాల నుంచి ట్రాన్స్ మిషన్ నష్టాలను భరిస్తూ కూడా విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని  సోమిరెడ్డి గుర్తు చేశారు. సామాన్య ప్రజలతో పాటు, రైతులు, పరిశ్రమలకు విద్యుత్ కీలక ఆధారం, అటువంటి విద్యుత్ రంగాన్ని
లాభనష్టాల పేరుతో ఏపీ ప్రభుత్వం విడిపించుకునే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.రైతులతో పాట వివిధ రంగాలకు సబ్సిడీపై, ఉచితంగా పంపిణీ చేస్తున్న విద్యుత్ సంబంధించిన మొత్తాన్ని ఎప్పటికప్పుడు జెన్ కో సంస్థకు ప్రభుత్వం రీయింబర్స్ చేస్తే ఆ సంస్థ లాభాల్లో ఉంటుందని స్వయంగా సమస్త ఉద్యోగస్తులే చెప్పడం శుభపరిణామం.అలా చేయకుండా ప్రైవేటు పరం చేయడం వెనుక ఉన్న ఉద్దేశమేమిటో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలోని ప్రాజెక్టును ఎన్టీపీసీకి దారాధత్తం చేసే ప్రయత్నంలో ఉన్నారని ఆయన ఆరోపించారు.  ప్రస్తుతం  కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియా, రైల్వేస్ వంటి భారీ సంస్థలనే ప్రైవేటు పరం చేసే ఆలోచనలో ఉందన్న అనుమానం కలుగుతుందన్నారు. భవిష్యత్తులో ఎన్టీపీసీని కూడా ప్రైవేటు పరం చేయదని నమ్మకమేంటని  చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయాలకు స్వస్తి చెప్పాల ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్, మాజీ కార్పొరేటర్ లో పెట్టు
సత్య నాగేశ్వరరావు యాదవ్, రామ్ మూర్తి యాదవ్, పొత్తూరు శైలజ,  వెంకటాచలం మండలం పార్టీ అధ్యక్షుడు నాగేంద్ర ప్రసాద్ యాదవ్, జన్ని రమణయ్య, మైథిలి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.