కరోనా ఉన్న కూడా ఎన్నికల్లో ఓటు వేసిన ఎమ్మెల్యే

కరోనా వైరస్ ఆయనను ఓటు వేయకుండా ఆపలేకపోయింది. పీపీఈ కిట్ ధరించి మరీ రాజ్యసభ ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొన్నారు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే. శుక్రవారం 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. భోపాల్‌లోని మూడు రాజ్యసభ ఎన్నికలకు జరిగిన పోలింగ్‌లో కరోనా సోకిన ఎమ్మెల్యే కునాల్ చౌదరి పీపీపీ కిట్ ధరించి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అప్పటికే మిగతా ఎమ్మెల్యేలు ఓటు వేయగా, కునాల్ చివర్లో ఓటు వేశారు. మధ్యాహ్నం 12.45 గంటలకు అంబులెన్సులో విధానసభకు చేరుకున్న ఎమ్మెల్యే కునాల్ పీపీఈ కిట్ ధరించి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 'మిగతా సభ్యులు నా దరిదాపుల్లోకి కూడా రాలేదు. వాళ్లు భయపడటం సహజమే కానీ నేను పీపీపీ కిట్ ధరించి పూర్తి జాగ్రత్తలు పాటించి మా పార్టీ అభ్యర్థికి ఓటు వేసి వచ్చాను' అని ఎమ్మెల్యే కునాల్ తెలిపారు. కరోనా సోకిన ఎమ్మెల్యే పోలింగ్‌లో పాల్గొనడం ఇదే ప్రథమం. దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి . వైరస్ సోకినా బాధ్యతాయుతమైన పౌరుడిలా ఓటు హక్కును వినియోగించుకున్నారు అని కాంగ్రెస్ నేతలు పేర్కొనగా, అసలు కరోనా సోకిన వ్యక్తిని లోపలికి ఎలా అనుమతించారంటూ బీజేపీ నేతలు వాదిస్తున్నారు. క్వారంటైన్‌లో ఉండాల్సిన వ్యక్తి ఓటు వేయడానికి ఎన్నికల సంఘం ఎలా అనుమతించిందని బిజెపి నాయకుడు హితేష్ బాజ్‌పాయ్ ప్రశ్నించారు.

ఇది అంటువ్యాధి నియంత్రణ నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుందని ట్వీట్ చేశారు. ఈనెల 12 న కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ చౌదరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. మార్చి నెలలోనే రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా ఎన్నికల సంఘం వాయిదా వేసింది. అయితే గత కొన్ని వారాలుగా దాదాపు 10 రాష్ర్టాల్లో రాజీనామాలు, రిసార్ట్ రాజకీయాలు లాంటి ఆరోపణలు తలెత్తుతున్న నేపథ్యంలో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది.