కరోనావైరస్ ప్రపంచాన్ని భయపెడుతున్న నేపథ్యంలో ఈ వ్యాధికి సంబంధించి మరిన్ని
హెచ్చరికలు జారీ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. పొగతాగేవారికి కరోనావైరస్ సోకితే వారి జీవితం అత్యంత ప్రమాదకరంగా మారుతుందని అది ప్రాణాలు తీసే వరకు కూడా దారి తీస్తుందని హెచ్చరిస్తోంది. అయితే ఈ ప్రమాద స్థాయి ఏ మేరకు ఉంటుందో అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఇక పొగతాగేవారిని, కోవిడ్-19 పేషెంట్లలో పలు అంశాలు తీసుకుని క్షుణ్ణంగా స్టడీ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అంతేకాదు ఇన్ఫెక్షన్ సోకే రేటు, వ్యాధి బారిన పడే అవకాశాలు, మరణం వంటి అంశాలను స్టడీ చేసింది.
అయితే కరోనావైరస్ సోకి హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన వారిలో 18శాతం మంది పొగరాయుళ్లు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఏప్రిల్ నెలలో ఫ్రెంచి పరిశోధకులు ఒక రిపోర్టును విడుదల చేశారు. పొగతాగేవారు కోవిడ్-19 బారిన పడే అవకాశాలు కాస్త తక్కువగా ఉన్నాయనేది నివేదిక ద్వారా వెల్లడించారు. కోవిడ్-19 పేషెంట్లు, ఇతర హెల్త్ వర్కర్లపై నికోటిన్‌తో పరీక్షించాలని భావించారు. అయితే ఆ సమయంలో చాలామంది శాస్త్రవేత్తలు సరైన డేటా లేకుండా ఇలాంటి ప్రయోగాలు చేయడం సరికాదంటూ వారించారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ప్రస్తుతం తమ వద్ద ఉన్న డేటా ప్రకారం పొగతాగేవారిలో కోవిడ్-19 రిస్క్ ఎక్కువగా ఉందని పేర్కొంది. కాబట్టి పొగతాగేవారు మరింత కాలం జీవించాలంటే వెంటనే ఆ దురలవాటును మానుకోవాలని వెల్లడించింది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ఈ మహమ్మారి 5,19,602 మందిని పొట్టనపెట్టుకోగా కోటిమందికి పైగా దీనిబారిన పడి చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో అయితే ఈ మహమ్మారి బారిన పడి 1,30,816 మంది మృతి చెందగా 27,81,085 మందికి పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాతి స్థానంలో బ్రెజిల్ ఉండగా... రష్యా మూడో స్థానం, భారత్ నాల్గవ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు భారత్‌లో 17,850 మంది మృతి చెందగా 6,06,907 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.