కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కీలక ప్రకటన చేశారు. ఇకపై ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని ప్రకటించే సంక్షేమ పథకాలు ఇకపై ఉండవని ప్రకటించారు. ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందాలన్న ధ్యేయంతోనే ముందుకు సాగుతామని ప్రకటించారు. లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత మొదటి సారి హిమచల్ ప్రదేశ్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అటల్ జీ టన్నెల్ ను ప్రారంభం అనేది అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్న లక్ష్యంతోనే జరిగిందని, దేశంలోని ప్రతి మూలకు, ప్రతి వ్యక్తికీ అభివృద్ధి ఫలాలు అందాలన్నదే తమ ధ్యేయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పై ఆయన దుమ్మెత్తి పోశారు. 'లాహుల్ స్పితి' వంటి కొన్ని ప్రదేశాలను ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని, ప్రజలే సొంతంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో కొన్నిజిల్లాలు రాజకీయ లాభాన్ని, సంక్షేమానికి దూరమయ్యాయని విమర్శించారు. కానీ తమ హయాంలో 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' అన్న నినాదంతో అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని ఆయన తెలిపారు.

''ప్రభుత్వ పనివిధానంలో ఓ కొత్త మలుపు రాబోతోంది. ఇకపై ఓటుబ్యాంక్ ఆధారంగా పథకాలు ఉండవ్. ఇకపై అందరికీ అభివృద్ది ఫలాలు అందాలన్నదే తమ లక్ష్యం.'' అని మోదీ స్పష్టం చేశారు. దళితులకు, ఆదివాసీలకు, అణగారిన వర్గాల వారికి మౌలిక సదుపాయాను కల్పించడానికి సర్వధా ప్రయత్నిస్తూనే ఉన్నామని, అటల్ టన్నెల్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి దొరకుతుందని మోదీ తెలిపారు.