అరుదైన ఖగోళ వింత ఈ నెల 21న కనిపించనుంది. గురు, శని గ్రహాలు ఒకదానికొకటి అత్యంత సమీపంలోకి రానున్నాయి. ఇవి రెండూ కలిపి ఆకాశంలో ఓ నక్షత్రంలా కనిపించనున్నాయి. చివరిసారి 1623లో ఈ రెండు గ్రహాలు ఇంత సమీపానికి వచ్చాయి. అంటే 397 ఏళ్ల తర్వాత మరోసారి ఆ అద్భుతం జరగబోతోందని బిర్లా ప్లానెటేరియం డైరెక్టర్ దేబి ప్రసాద్ దువారీ చెప్పారు. దీనిని ఓ గ్రేట్ కంజంక్షన్‌గా పిలుస్తారని తెలిపారు. ఏవైనా రెండు ఖగోళ రాశులు భూమి నుంచి చూసినప్పుడు రెండూ అత్యంత సమీపంగా కనిపిస్తే దానిని కంజంక్షన్ అంటారని, ఇదే గురు, శని గ్రహాల విషయంలో గ్రేట్ కంజంక్షన్ అంటారని ఆయన చెప్పారు. ఇది మళ్లీ మార్చి 15, 2080లో ఇలా అత్యంత సమీపానికి రానున్నాయి.డిసెంబర్ 21న రాత్రిపూట ఈ రెండు గ్రహాల మధ్య దూరం 73.5 కోట్ల కిలోమీటర్లుగా ఉంటుందని దేబి ప్రసాద్ తెలిపారు. ఆ రోజు సూర్యస్తమయం తర్వాత ఇండియాలోని చాలా నగరాల్లో ఈ కంజంక్షన్ కనిపిస్తుందని చెప్పారు. ఆ రోజు వరకూ ప్రతి రోజూ ఈ రెండు గ్రహాల మధ్య దూరం క్రమంగా తగ్గడం కూడా చూడొచ్చని అన్నారు.