ఎస్‌బీఐ కస్టమర్లు తెలుసుకోండి: నేటి నుంచి అమల్లోకి మూడు నిర్ణయాలు*

దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తీసుకున్న మూడు కీలక నిర్ణయాలు నేటి(01 జనవరి 2020) నుంచి అమల్లోకి రానున్నాయి. 

 *నేటి నుంచి మారిన ఆ మూడు అంశాలు ఏమిటంటే?* 

రుణం రేటులో కోత:
గృహ రుణ వడ్డీ రేట్లలో 25 బేసిస్‌ పాయింట్లు(పావు శాతం) కోత పెట్టింది ఎస్బీఐ బ్యాంకు. దీంతో వార్షిక ఆధారిత వడ్డీ రేటు(ఇబిఆర్‌) ప్రస్తుత 8.05 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గనుంది. రేట్ల తగ్గింపు ఇవాళ( 2020 జనవరి 1) నుంచి అమలు చేయనున్నారు. దీంతో ఇప్పటికే ఇబిఆర్‌ ఆధారంగా గహ రుణాలు తీసుకున్న ఖాతాదారలు, ఎంఎస్‌ఎంఇలు 25 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేటులో లబ్ది పొందనున్నట్లు బ్యాంకు తెలిపింది.

ఈ నిర్ణయంతో కొత్తగా గహ రుణాలు పొందే వారికి రుణ వడ్డీ రేటు 7.9 శాతం నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. ఇది వరకు ఈ రేటు 8.15 శాతంగా ఉంది. ప్రస్తుత ఏడాదిలో 8సార్లు ఎంసిఎల్‌ఆర్‌లో కోతను అమలు చేసినట్లయ్యింది. వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును ఇటీవల ఆర్‌బిఐ 5.15 శాతానికి పరిమితం చేసింది. దీంతో రెపో రేటుకు అనుసంధానమైన ఇబిఆర్‌ను ఆమేర సర్దుబాటు చేసినట్లు ఎస్‌బిఐ తెలిపింది.

 *ఓటీపీ ఆధారిత క్యాష్ విత్‌డ్రా సేవలు:* 

స్టేట్ బ్యాంక్ వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారిత క్యాష్ విత్‌డ్రా సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏటీఎం మోసాలను అరికట్టేందుకు బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతాదారులకు ప్రయోజనం కలుగనుంది. ఏటీఎంలో లావాదేవీలు సురక్షితం కానున్నాయి. ఈ రోజు నుంచే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎస్‌బీఐ ఓటీపీ ఆధారిత క్యాష్ విత్‌డ్రా సేవలు అన్ని ఏటీఎం లావాదేవీలకు వర్తించదు. కేవలం రూ.10,000కు పైన వ్యాల్యూ ఉన్న ట్రాన్సాక్షన్లకు ఇది వర్తిస్తుంది.
ఎస్‌బీఐ ఏటీఎం నెట్‌వర్క్‌కు అంతటికీ ఓటీపీ విధానం నేటి నుంచి అమలులోకి వస్తుంది. బ్యాంక్ ఖాతాదారులు ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవాలని ప్రయత్నిస్తే.. అప్పుడు బ్యాంక్ అకౌంట్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేయాలి. అప్పుడే డబ్బులు తీసుకోవడం వీలు అవుతుంది. దీంతో మోసపూరిత లావాదేవీలకు చెక్ పెట్టొచ్చని బ్యాంక్ భావిస్తోంది.

 *డెబిట్ కార్డులు పనిచేయవు:* 

మ్యాగ్ స్ట్రిప్ డెబిట్ కార్డులు అంటే పాత ఎస్‌బీఐ డెబిట్ కార్డ్స్ వాడుతున్నవారు తప్పకుండా తెలుసుకోవలసిన విషయం ఇది. స్టేట్ బ్యాంక్ ఎప్పటి నుంచో పాత డెబిట్ కార్డులను కొత్త కార్డ్స్‌తో మార్చుకోవాలని కస్టమర్లను కోరుతూనే వస్తోంది. పాత మ్యాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డుల స్థానంలో కొత్త ఈఎంవీ చిప్ డెబిట్ కార్డులు తీసుకొచ్చింది. సంబంధిత బ్రాంచ్‌కు వెళ్లి పని పూర్తి చేయాలని, కస్టమర్లు ఉచితంగానే పాత మ్యాగ్నటిక్ డెబిట్ కార్డుల స్థానంలో కొత్త ఈవీఎం చిప్ డెబిట్ కార్డును పొందచ్చని సంస్థ యాజమాన్యం ఇప్పటికే కస్టమర్లకు చెప్పింది.

ఎస్‌బీఐ నెట్ బ్యాకింగ్, ఎస్‌బీఐ యోనో యాప్ లేదంటే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి వీటిని మార్చుకోవచ్చని తెలిపింది బ్యాంకు. బ్యాంకు అకౌంట్ కరెంటు అడ్రస్ అప్ డేట్ చేసుకోవాలని, కొత్త ఈవీఎం చిప్ కార్డు బ్యాంకు అకౌంట్ ఉన్న అడ్రస్‌కు వెళ్లిపోతుందని..అందువల్ల అడ్రస్ మారి ఉంటే అప్ డేట్ చేసుకోవాలని సిబ్బంది సూచించారు.