తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలి పదవికి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత చంద్రబాబు పంపారు. వ్యక్తిగత కారణాలతోనే ఆమె ఈ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న గల్లా అరుణకుమారి.. వైఎస్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 ఎన్నికలకు ముందు తెదేపాలో చేరిన ఆమె.. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. అనంతరం 2018లో ఆమెను పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా చంద్రబాబు నియమించారు. గల్లా అరుణకుమారి తనయుడు జయదేవ్‌ 2014, 2019 ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ నుంచి విజయం సాధించారు.