వైసీపీ ఎంపీలకు దమ్ముందా : పవన్ కల్యాణ్


 విశాఖ: స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లకార్డ్‌ పట్టుకునే దమ్ము వైసీపీ ఎంపీలకు ఉందా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షను విరమించిన పవన్ కల్యాణ్..


 వైసీపీ నేతలపై మండిపడ్డారు. వైసీపీ నేతలు తమకు శత్రువులు కాదని.. వారి విధానాలనే వ్యతిరేకిస్తున్నామన్నారు. పోరాడి తెచ్చుకున్న ప్లాంట్‌ను ఎలా ప్రైవేటీకరిస్తారని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్ అనేది ఒక పరిశ్రమ మాత్రమే కాదని అది పోరాటాలకు, త్యాగాలకు గుర్తు అని చెప్పారు. ప్లాంట్‌ కోసం ఎంతోమంది ప్రాణాలు, పదవులు త్యాగాలు చేశారని పవన్ గుర్తు చేశారు. జనసేనకు అధికారం ఇస్తే ఎంపీ, ఎమ్మెల్యే ఏ స్థాయిలో పని చేస్తారో చేసి చూపిస్తామన్నారు.

''ప్లాంట్‌ కోసం వైసీపీ నేతలను చొక్కా పట్టుకుని నిలదీయాలి. ప్రజల నుంచి స్పందన లేకపోతే నాయకులు కూడా ఏమీ చేయలేరు. ఇది ఒక్కరి సమస్య కాదు.. రాష్ట్ర సమస్య.. అందరూ కలిసిరావాలి. నోటుకు ఓటు అమ్ముకుంటే అది ప్రజల స్వయంకృతాపరాధం. డబ్బుకు ఓటును అమ్ముకుంటే ఇలాంటి కష్టాలే వస్తాయి. పార్లమెంట్‌, అసెంబ్లీలో ఎక్కువ బలం ఉన్న వైసీపీనే బాధ్యత తీసుకోవాలి. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ప్లాంట్‌ ప్రైవేటీకరణతో రాష్ట్రానికి సంబంధం లేదంటున్నారు. మరి ఎందుకు హామీ ఇచ్చారు, ఎందుకు ఓట్లు వేయించుకున్నారు. స్టీల్‌ప్లాంట్‌పై హామీ ఇచ్చిన వైసీపీని ప్రజలు నిలదీయాలి. ప్లాంట్‌ నిర్వాసితులకు జనసేన అండగా ఉంటుంది. విశాఖ ప్లాంట్‌ను పరిశ్రమగా చూడవద్దు. ఆంధ్రుల ఆత్మగౌరవంగా చూడాలని అమిత్‌షాకు నివేదించాం. అప్పుల పేరుతో విశాఖ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నాం అన్నారు. ఏపీకి రూ.6 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, మరి రాష్ట్రాన్ని ప్రైవేటీకరిస్తారా?. దామోదర సంజీవయ్యను ప్రేరణగా తీసుకుని ముందుకెళ్తున్నాం. రాయలసీమ నేతలను గౌరవించని మీరా.. కర్నూలును న్యాయరాజధానిగా మార్చేది?. ఒక చిన్న భవనం కూడా కట్టని మీరు 3 రాజధానులు నిర్మిస్తారా?. ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్నవారిపై మాత్రం దాడులు చేస్తారు.'' అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.