యంగ్ హీరో నితిన్‌, షాలిని వివాహ వేడుక జూలై 26 రాత్రి 8:30 గంట‌ల‌కు హైద‌రాబాద్‌లోని ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌లో జ‌ర‌గ‌నున్న‌ విషయం తెలిసిందే. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్ది మంది అతిథులు మాత్ర‌మే హాజరుకానున్నారు. అయితే శుక్రవారం నితిన్ పెళ్లికొడుకు ఫంక్షన్ నిర్వహించారు. ఈ ఫంక్షన్‌కు నితిన్ ఎంతో అభిమానించే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాత చినబాబుతో పాటు మరికొందరు
హాజరైయ్యారు. అయితే నితిన్ పెళ్లి వేడుకకు పవన్ హాజరవ్వడం లేదని, అందుకే ముందుగానే నితిన్‌కు ఆశీస్సులు అందించడానికి పెళ్లికొడుకు ఫంక్షన్‌కు వెళ్లారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు.ఇక పవన్, త్రివిక్రమ్ తన పెళ్లికొడుకు ఫంక్షన్‌కు హాజరవడంతో.. నితిన్ ఆనందానికి అవధులే లేవంటే నమ్మాలి. తన ఆనందాన్ని ట్వీట్ రూపంలో తెలియజేశాడు నితిన్. నా పెళ్లికొడుకు ఫంక్షన్‌కు వచ్చి, నన్ను ఆశీర్వదించిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌గారికి, త్రివిక్రమ్‌గారికి, చినబాబుగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది.. అని నితిన్ తెలిపారు.