రెగ్యులారిటీ లేని పత్రికలు బ్లాక్

ఎంపానెల్‌‌లో ఉన్న 178పై వేటు

తెలుగు రాష్ట్రాల్లో 20 పత్రికలపై చర్య

న్యూఢిల్లీ, జులై 3 :

 రెగ్యులారిటీ లేని పత్రికలపై వేటు వేసే ప్రక్రియ కరోనా కష్టకాలంలోనూ కొనసాగుతోంది. ఒకవైపు ఆర్ఎన్ఐ, మరోవైపు డీఏవీపీ ఇప్పటికే పత్రికలపై నిఘా పెంచి నిబంధనల ప్రకారం నడవని వాటిపై చర్యలు తీసుకుంటున్న విషయం ప్రచురనకర్తలకు తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా డీఏవీపీ ఎంపానెల్‌మెంట్ జాబితాలో ఉన్న 6622 వార్తా పత్రికలలో రెగ్యులారిటీ పాటించని 178 ప్రచురణలపై చర్యలు తీసుకుంది బీవోసీ.
ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందినవి (తెలంగాణకు చెందినవి 15, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి 5) 20 ఉన్నాయి. ఆ జాబితాను ఇక్కడ పరిశీలివంచవచ్చు.
38 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కలిపి 6622 పత్రికలు డీఏవీపీ (బీవోసీ) వద్ద ఎంపానెల్‌మెంట్ పొంది ఉన్నాయి. (ఈరోజు వరకూ డీఏవీపీ పీఏసీ జాబితాలో ఉన్న పత్రికలను ఈ లింక్ ద్వారా పరిశీలించవచ్చు.) ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఎంపానెల్‌మెంట్ కలిగిన పత్రికలు 137 ఉండగా అందులో 5 పత్రికలు బ్లాక్ లిస్ట్‌లో ఉన్నట్లు డీఏవీపీ రికార్డుల్లో ఉంది. రాష్ట్రంలోని అమలాపురం, అనంతపురం, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కృష్ణా జిల్లా, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ప్రచురణ కేంద్రాలలో ఆయా (137) పత్రికలు ఎంపానెల్‌మెంట్ కలిగి ఉన్నాయి.
అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, మల్కాజ్‌గిరి, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సికింద్రాబాద్, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్ ప్రచురణ కేంద్రాలలో మొత్తం ఎంపానెల్‌మెంట్ కలిగిన పత్రికలు 228 ఉండగా, వాటిలో బ్లాక్‌లో ఉన్నవి 15. మరిన్ని వివరాలకు డీఏవీపీ అధికారిక వెబ్‌సైట్‌లోని ఈ లింక్‌ను సందర్శించవచ్చు.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధీనంలోని డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ (DAVP) (తాజాగా ఈ సంస్థ పేరు మార్చుకుంది. డీఏవీపీ స్థానంలో ‘బ్యూరో ఆఫ్ ఔట్రీచ్ & కమ్యూనికేషన్ – బీఓసీ) 2016 జూన్ 7 నుంచి అమలులోకి వచ్చిన ‘భారత ప్రభుత్వ ప్రింట్ మీడియా ప్రకటన విధానం’లోని ‘నిబంధన-13’ ప్రకారం దరఖాస్తుదారుడు (ప్రచురణకర్త) నడుపుతున్నది దినపత్రిక అయితే, ప్రతి నెలలో కనీసం 25 రోజులలో (ఫిబ్రవరిలో తప్ప) వార్తాపత్రికను ప్రచురించాలి. అంతకుముందు 12 నెలల్లో మొత్తం కలిపి 300 ప్రచురణలు ఉండాలి. అదే వారపత్రిక (వీక్లీ)లు మునుపటి సంవత్సరంలో 46 సంచికలు, పక్ష పత్రికలు 23 సంచికలు, మాసపత్రికలు మునుపటి సంవత్సరంలో 11 సంచికలను క్రమం తప్పకుండా ప్రచురితమై ఉండాలి.
ఈ నేపథ్యంలో డీఏవీపీలో ఎంపానెల్ అయిన అన్ని వార్తాపత్రికలు తమ తమ నెలవారీ కాపీలను తరువాతి నెల 15వ తేదీకి ముందు దేశరాజధాని ఢిల్లీలోని ‘సమాచార్ భవన్, ఫేజ్ – 5, సీజీఓ కాంప్లెక్స్, లోధి రోడ్, న్యూఢిల్లీ-110003’ డీఏవీపీ (బీఓసీ) చిరునామాకు విధిగా సమర్పించాలి, విఫలమైతే ఆ వార్తాపత్రికకు రేట్‌ కార్డు ప్రకారం వచ్చే ప్రకటనలు నిలిచిపోతాయి. (దీన్నే సాంకేతికంగా పత్రికను సస్పెన్షన్‌లో పెట్టడం అంటారు.) ఈ మేరకు ఎంపానల్‌మెంట్ పొందిన ప్రచురణకర్తలు విధిగా ప్రతి నెలా 15వ తేదీలోపు గత నెల సంచికలను డీఏవీపీకి ‘రెగ్యులారిటీ చెక్’ నిమిత్తం తప్పనిసరిగా పంపించాల్సి ఉంటుంది.
రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఫర్ ఇండియా (ఆర్ఎన్ఐ) వద్ద రిజిస్ట్రేషన్ కలిగిన పత్రికల రెగ్యులారిటీ విషయంలోనూ అధికారులు ఈ మధ్య కఠిన నిబంధనలే అమలుచేస్తూ వస్తున్నారు. ఆర్ఎన్ఐ సర్టిఫికేట్‌లో ఏవైనా మార్పుల నిమిత్తం సంప్రదింపులు జరిపిన సమయంలో ఆర్ఎన్ఐ ఈ రెగ్యులారిటీ నిబంధనను కచ్చితంగా అమలుచేస్తూ పాత సీనియారిటీ కావాలంటే దానికి సంబంధించిన సంచికలలో కనీసం యాభై శాతం కాపీలను సమర్పించాలని కోరుతోంది. ఒకవేళ సమర్పించని ప్రచురణల విషయంలో సీనియారిటీ కోల్పోయినట్లే భావించాలి.