‘‘చాలా సమస్యలు మౌనంతో పరిష్కారం అవుతాయి. కానీ, మనం మాటలతో ఆ అవకాశాన్ని చేజార్చుకుంటాం ’’ అన్న మహాత్ముని సూక్తిని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మననం చేసుకున్నారు. నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం లాల్ బహదూర్ శాస్త్రి అని మంత్రి పేర్కొన్నారు.  ఇద్దరు మహనీయులు ఒకే రోజున జన్మించడం , దేశం కోసం వాళ్లు చేసిన త్యాగాలు,సేవలను స్మరించుకోవడం భారతీయులుగా గర్వించదగినవని మంత్రి మేకపాటి ఆ మహనీయులను కొనియాడారు. ఎవరికీ సాధ్యం కాని అహింస మార్గంలో నడవడం వల్లనే గాంధీ 'మహాత్ముడి'గా అవతరించారన్నారు. 'జై జవాన్ జై కిసాన్' నినాదంతో లాల్ బహదూర్ శాస్త్రి  గ్రీన్ రెవల్యూషన్ కి బాటలు వేశారని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, లాల్ బహదూర్ శాస్త్రి జైజవాన్ జై కిసాన్ నినాదాలకు ప్రతిరూపమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనగా మంత్రి మేకపాటి అభివర్ణించారు.  

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని  గాంధీబొమ్మ సెంటర్ లో ఉన్న మహాత్ముడి విగ్రహానికి  మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సహా  మంత్రి మేకపాటి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.