బంగారు ముక్కు పుడక ఓ వ్యక్తి దారుణమైన పనికి పాల్పడ్డాడు. చనిపోయిన మహిళను ఖననం చేసిన తర్వాత ముక్కు పుడక కోసం మళ్లీ శవాన్ని బయటకు తీశారు. ఈ దారుణ సంఘటన గురువారం మెదక్ పట్టణంలో చోటుచేసుకుంది.
గోల్కొండ వీధికి చెందిన కొప్పుల పోచమ్మ(80) గత నెల 24న అనారోగ్యంతో మరణించింది.
సంప్రదాయం ప్రకారం ఆమె కుటుంబ సభ్యులు గిద్దకట్ట శ్మశాన వాటికలో పూడ్చి పెట్టారు. పోచమ్మ మృతదేహాన్ని ఖననం చేసే సమయంలో ముక్కు పుడకలు ఉండటాన్ని కాటికాపరి సంబంధీకులు గమనించారు. పోచమ్మ కుటుంబ సభ్యులంతా ఇళ్లకు వెళ్లిపోయిన తర్వాత ముక్కుపుడకల కోసం మళ్లీ సమాధాని తవ్వి తీశారు.
రెండు ముక్కు పుడకలు తీసుకొని ఎప్పటిలాగే పూడ్చే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న కొందరు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి కొడుకు ఊశయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. బంగారం కోసం కాటికాపరి ఈ విధంగా చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.