చిట్టమూరు: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు అమానుషం ఆని టీడీపీ  మండల కన్వీనర్ గణపర్తి కిషోర్ నాయుడు అన్నాడు. శుక్రవారం మండల కేంద్రంలోని టిడిపి కార్యాలయం లో కిషోర్ నాయుడు అధ్యక్షతన జరిగిన టిడిపి మండల సమావేశంలో రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న పాశవిక దాడులను ఆయన  ఖండించారు. ఈ సందర్భంగా ముందుగా మహాత్మా గాంధీ 151 వ జయంతి పురస్కరించుకొని గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో కిషోర్ నాయుడు మాట్లాడుతూ ఈ గాంధీ బ్రిటిష్ వాళ్ళతో పోరాడి శాంతి యుతం గా స్వాతంత్రం తీసుకు వచ్చాడని అలాంటిది ఇప్పుడు రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుండి బడుగు బలహీన వర్గాల పై దాడులు చేయించి వారిని భయభ్రాంతులకు గురిచేసి తమ గుప్పిట్లో ఉంచుకోవాలని రాక్షస ఆలోచనతో సీఎం జగన్మోహన్ రెడ్డి వారి అనుచరుల చేత ఈ దాడులు చేయిస్తున్నారని అందుకు నిదర్శనం దళిత డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడి మొదలు చిత్తూరు జిల్లాలో స్వయానా జడ్జి  రామకృష్ణ తమ్ముడు రామచంద్ర పై పాశవికంగా నడిరోడ్డు పైన దాడి  చేయించాడని అంతే కాకుండా మానవతా దృక్పథంతో సాటి కులస్థుడ్ని పరామర్శించడానికి వెళుతున్న గూడూరు మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ ని గురువారం రాత్రి తమ ఇంటి వద్ద హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయం అని ఆయన అన్నారు. 
వైసిపి ప్రభుత్వ వ్యతిరేక  పరిపాలన విధానాన్ని బడుగు బలహీన వర్గాల ప్రజలు, మేధావులు గమనిస్తున్నారని ఇప్పటికైనా దాడులకు స్వస్తి పలికి పరిపాలన పై ముందుచూపుతో ప్రయాణించాలని అలా కాని పరిస్థితుల్లో త్వరలోనే వైసీపీ నాయకులు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని కిషోర్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల ప్రధాన కార్యదర్శి చిన్నారావు, టిడిపి జడ్పిటిసి సభ్యులు మాలపాటి వెంకటకృష్ణ, బీసీ నాయకులు కస్తూరయ్య, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు శ్రీనివాసులు రాజేష్ రెడ్డి పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.