మరోసారి లాక్‌డౌన్‌ తప్పదు

గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో లాక్‌డౌన్‌కు సడలింపులు అమల్లోకి వచ్చిన తొలిరోజే కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.  కరోనా పాజిటివ్‌ కొత్త కేసులు వేగంగా ప్రబలితే మరోసారి లాక్‌డౌన్‌ తప్పదని స్పష్టం చేసింది. ఈరోజే 2553 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయని, 72 మంది మరణించారని పేర్కొంది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 42,000 దాటగా, కోవిడ్‌ రికవరీ రేటు 27 శాతానికి పెరగడం ఊరట కల్పించింది. ఇక రెడ్‌జోన్లు, కంటైన్మెంట్‌ జోన్లలో ఎలాంటి సడలింపులూ ఉండవని పేర్కొంది. రాష్ట్రాల మధ్య రాకపోకలను అప్పుడే అనుమతించబోమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ గారు మీడియా సమావేశంలో వెల్లడించారు. రెడ్‌ జోన్లలో రిక్షాలు, ఆటోలు, ట్యాక్సీలు నిషేధమని, స్కూళ్లు, రెస్టారెంట్లు, మాల్స్‌, సెలూన్లు, స్పాలను అనుమతించమని స్పష్టం చేశారు. అన్ని మతాల ప్రార్ధనా స్థలాలను ప్రారంభించరాదని, చిరు వ్యాపారులు ఒకరు నిర్వహించే దుకాణాలను తెరుచుకోవచ్చని చెప్పారు. కంటైన్మెంట్‌ జోన్లలో కఠిన నియంత్రణలు అవసరమని చెప్పారు. ఇక వలస కూలీల తరలింపునకు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు ప్రత్యేక రైళ్లు నడిపారని, వలస కూలీల నుంచి చార్జీలు వసూలు చేయలేదని స్పష్టం చేశారు. కార్మికుల తరలింపునకు అయిన వ్యయంలో 85 శాతం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించిందని చెప్పారు.