నెల్లూరు, జనవరి 28, (రవికిరణాలు) : వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఒక్క అవకాశం అంటూనే రాష్టాన్ని అధోగతిపాలు చేసాడని మండిపడ్డారు.జైలు జీవితం అనుభవించిన జగన్కు ఇంకా ఆ బుద్ధులు
పోవడం లేదని, ఎవడబ్బ సొమ్మని.. ప్రతి శుక్రవారం 60 లక్షల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నావ్..? అని ప్రశ్నించారు.  వారానికి 60 లక్షలు ఖర్చు చేసే జగన్.. మనకు అవసరమా అనే ఆలోచన రాష్ట్ర యువతలో మొదలైందని విమర్శించారు. రాజన్న రాజ్యమంటూ దోపిడీ రాజ్యాన్ని, ఫ్యాక్షన్ రాజ్యాన్ని తీసుకొచ్చాడని, రాష్ట్ర ప్రజలంటే కసి, కోపం ఉండే ఏకైక ముఖ్యమంత్రిని చూస్తున్నామని దుయ్యబట్టారు.రాజధాని మహిళలను చిత్రహింసలు గురి చేసాడని ఎద్దేవా చేశారు. అమరావతి ఉద్యమాన్ని అణచివేసేందుకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చెయ్యాలని అన్నారు. జగన్ రాయలసీమ బిడ్డ అయితే.. దమ్ము ధైర్యం ఉంటే శాసన మండలి తరహాలోనే శాసన సభను కూడా రద్దు చెయ్యి అని సవాల్‌ విసిరారు. ప్రజాస్వామ్యంలో జగన్ పాలన పిచ్చోడి పాలనలగా ఉందని ఈ సందర్భంగా ఆయన ఎద్దేవా చేశారు.