- విద్యావిధానంలో మార్పుల కోసం విశ్వవిద్యాలయాలు దృష్టిపెట్టాలి
- ప్రపంచ ఉత్తమ విద్యాలయాల జాబితాలో చోటు దక్కించుకోవాలి
- చదువుతోపాటు, సామాజిక బాధ్యతనూ యువత అలవరచుకోవాలి
- విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
నెల్లూరు, జనవరి 21 : ప్రపంచస్థాయి విద్యాసంస్థలతో దీటుగా భారతీయ విద్యాసంస్థలు, యూనివర్సిటీలు పోటీపడాలని ఇందుకోసం విద్యావిధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నైతికత, విలువలతో కూడిన విద్యద్వారానే సాధికారత సాధ్యమవుతుందని.. కేవలం ఉపాధికల్పన ఒక్కటే విద్య అంతిమ లక్ష్యం కాకూడదన్నారు. నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచ అత్యున్నత యూనివర్సిటీల జాబితాలో స్థానం సంపాదించుకునేందుకు వర్సిటీలు, విద్యాసంస్థలు మరింతగా శ్రమించాల్సిన అవసరముందన్నారు. ఒకప్పుడు విశ్వగురుగా ఉన్న భారత్.. ప్రపంచ అత్యుత్తమ యూనివర్సిటీలైన నలంద, తక్షశిల వంటి విద్యాకేంద్రాల ద్వారా ప్రపంచానికి జ్ఞానబోధ చేసిన విషయాన్ని మరవొద్దన్నారు. అంతటి శక్తిసామర్థ్యాలు భారత్‌లో ఉన్నాయని.. కావాల్సిందల్లా మన నైపుణ్యానికి పదును పెట్టడమేనన్నారు. ప్రైవేటు రంగం కూడా విద్యావ్యవస్థలో పెట్టుబడులు పెట్టి.. ఆర్ అండ్ డీ (పరిశోధనాభివృద్ధికి) ని ప్రోత్సహించాలన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు కూడా విద్యనందించడాన్ని ఓ మిషన్ గా స్వీకరించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘విద్యావిధానంలో మార్పుద్వారానే మన విద్యలో నాణ్యతను పెంచుకునేందుకు వీలుంటుంది. అద్భుతమైన యువశక్తి భారతదేశానికి ఓ వరం. ఈ యువశక్తికి నైపుణ్యతను, సృజనాత్మకతను అందిస్తే.. ప్రపంచవ్యాప్తంగా అద్భుతాలు సృష్టించడం ఖాయం. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థల్లో భారతీయులే ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అదే బాటలో మనమూ వెళ్లాలి. యూనివర్సిటీ స్థాయి నుంచే నైపుణ్యతను సంపాదించి దేశానికి ఉపయోగపడే రీతిలో పరిశోధనల్లో భాగస్వాములు కావాలి. విద్య అనేది కేవలం ఉద్యోగ సముపార్జనకే కాదు. సాధికారతను పొందేందుకు, మన జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు కూడా ఉపయోగపడాలి. అప్పుడే మనం చదువుకున్న చదువుకు సార్థకత కలిగినట్లు’ అని అన్నారు.విద్యార్థులు, యువకులు చక్కగా చదువుకోవడంతోపాటు సామాజిక బాధ్యతను కూడా ఓ ‘మిషన్’గా తీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. శ్రఎవరికి వారు తోచినంతమేర సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. సమాజంలోని మూఢనమ్మకాలను పారద్రోలి.. ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు కృషిచేయాలి. స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాల్లో భాగస్వాములై.. స్వచ్ఛత అవసరాన్ని సమాజానికి అర్థం చేయించాలి. ప్రతి మంచిపనిలోనూ మేం ముందుంటాం అనే భావనను పెంపొందించుకోవాలి’ అని ఆయన సూచించారు. సమాజసేవలో ఉన్న ఆనందం వర్ణింపనలవికాదని.. దీన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకుని మహదానందాన్ని పొందాలన్నారు. తద్వారా మనం చదువుకునే విద్యతోపాటు చేసే పనులపై మరింత శ్రద్ధ పెట్టేందుకు ప్రేరణ కలుగుతుందన్నారు.ప్రేరణాత్మకం, స్ఫూర్తిదాయమైన భారతదేశ చరిత్రను నేటి విద్యార్థులకు అందించాల్సిన అవసరముందని.. శ్రీ పొట్టిశ్రీరాములు, శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు, శ్రీ అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో మహానుభావుల గురించి చిన్నారులకు బోధించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో అలజడులు సృష్టించేవారి వలలో పడకుండా.. విలువలు, సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ ముందుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు. నేటి సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ సమాజంలో ఎన్నో అవకాశాలు కళ్లముందు కనబడుతున్నాయని వాటిని అందిపుచ్చుకునేందుకు సన్నద్ధం కావాలన్నారు. ఇదే సమయంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని.. వాటికి పరిష్కరాలు కనుగొనాలని సూచించారు. పర్యావరణ, వాతావరణ పరిరక్షణపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలను ఉపరాష్ట్రపతి అందజేశారు. విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ‘కాలేజ్ టు విలేజ్’ (గ్రామాల వద్దకే కళాశాల) విధానాన్ని అవలంబిస్తున్న విక్రమ సింహపురి యూనివర్సిటీని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఏపీ ఉన్నతవిద్యామండలి చైర్మన్ ఆచార్య హేమచంద్ రెడ్డి, విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫెసర్ ఆర్ సుదర్శన్ రావుతోపాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.