పన్నుల వసూళ్ళలో రాష్ట్రంలోనే మొదటి స్థానం


- కమిషనర్ దినేష్ కుమార్


కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పర్యవేక్షణలో ఆర్ధిక సంవత్సరం 2020-21 కి 55.11 కోట్ల ఆస్థి పన్నులు వసూలు చేసి రాష్ట్రంలోనే నెల్లూరు నగర పాలక సంస్థ మొదటి స్థానంలో నిలిచిందని కమిషనర్ దినేష్ కుమార్ హర్షం వ్యక్తం చేసారు. కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కమిషనర్ మాట్లాడారు. పన్నులు చెల్లించడాన్ని బాధ్యతగా భావించిన నగర ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత సంవత్సరం వసూలు చేసిన పన్నులు 33.35 కోట్ల రూపాయలు కాగా ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి గతేడాదికన్నా అదనంగా 21.76 కోట్లు వసూలు చేసి రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్ల కన్నా మెరుగైన ఫలితాలను ప్రదర్శించడంతో ఈ ఘనత సాధించామని ఆయన స్పష్టం చేశారు. నగర పాలక సంస్థ నుంచి ప్రజలకు అందించిన ఆస్థి పన్నుల డిమాండు నోటీసుల పరంగా 108.33 కోట్ల రూపాయలకు గాను ఈ ఆర్ధిక సంవత్సరంలో 55.11 కోట్ల రూపాయల మొత్తాన్ని వసూలు చేసి రాష్ట్రంలో ఐదవ స్థానాన్ని సాధించామని కమిషనర్ తెలిపారు. మిగులు మొత్తం 53.22 కోట్ల పన్నుల చెల్లింపు ఆలస్యం చేసేకొద్దీ ప్రతిఒక్కరి అసలు పన్నుపై అదనంగా రెండు రూపాయల మేరకు వడ్డీరేటు విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి చెల్లించాల్సిన ఆస్థి పన్నులను ఏప్రిల్ నెలలోనే చెల్లిస్తే 5 శాతం రాయితీ కల్పిస్తామని, పెరిగిన నూతన పన్నులకు బదులుగా గతేడాది ఆస్థి పన్నులనే ఏప్రిల్ మాసాంతం వరకు పరిగణలోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ సయ్యద్ అబ్దుల్ సమద్, రెవెన్యూ అధికారులు, సచివాలయం అడ్మిన్ కార్యదర్శులను కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.రిజర్వేషన్లపై ప్రచారాలన్నీ అవాస్తవాలే


- కమిషనర్ దినేష్ కుమార్


కులగణన ఆధారంగా వార్డులలో రిజర్వేషన్లు కేటాయించినట్లు జరుగుతున్న ప్రచారాలన్నీ అవాస్తవాలే అని, ఇప్పటివరకు అధికారికంగా వార్డులలో ఏలాంటి రిజర్వేషన్లు నిర్ణయించలేదని నగర పాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ స్పష్టం చేసారు. ఆదివారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిజర్వేషన్లకు సంభందించిన ఒక ప్రశ్నకు ఆయన బదులిస్తూ వార్డు సచివాలయం కార్యదర్శులు, వలంటీర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కులగణనలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మహిళలు వంటి అంశాలకు సంభందించిన వివరాలను పూర్తిగా సేకరించామని, ఆయా వివరాలను ఈ నెల 8 వ తేదీన రాష్ట్ర కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(C&D.M.A) వారికి పంపించనున్నామని తెలిపారు. పునర్విభజన ప్రక్రియ పూర్తి పారదర్శకంగా చేపట్టిన అనంతరం నిర్వహించిన కులగణన వివరాలు ఉన్నతాధికారులకు పంపడం వరకే తమ బాధ్యత అని, రిజర్వేషన్ల కేటాయింపు పూర్తిగా సి&డిఎమ్ఏ వారు నిర్ణయిస్తారని కమిషనర్ స్పష్టం చేసారు. రిజర్వేషన్ల పై ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాలన్నీ నిరాధారాలేనని ఆయన కొట్టిపారేశారు.