ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మన శ్వాసకోశ వ్యవస్థపైనే ప్రభావం చూపుతుందని ఇప్పటిదాకా మనం అనుకుంటున్నాం. కానీ, ఇది మొత్తం శరీరంపైనే ఎఫెక్ట్‌ చూపిస్తుందనే చేదునిజం తాజాగా తెలిసింది. ముఖ్యంగా
మెదడు దెబ్బతినే అవకాశం చాలావరకు ఉందని ఓ అధ్యయనంలో తేలింది. కొవిడ్‌-19 వల్ల బ్రెయిన్‌ డ్యామేజ్‌ అవుతున్నదని పరిశోధకులు గుర్తించారు. నాడీవ్యవస్థ దెబ్బతినడంతోపాటు మతిమరుపు సమస్య వచ్చే ప్రమాదముందని నిర్ధారించారు. ఈ అధ్యయన వివరాలు ది లాన్సెట్‌ న్యూరాలజీ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
యూనివర్సిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్) పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కరోనా వైరస్‌ ప్రభావం వల్ల రోగిలో అరుదైన, ప్రాణాంతక మెదడు వాపులాంటి లక్షణాలు కన్పిస్తున్నాయని గుర్తించారు. దీన్నే అక్యూట్‌ డిసెమినేటెడ్‌ ఎస్‌సిఫలోమైలిటీస్‌ (ఏడీఈఎం) అని పిలుస్తారని వారు పేర్కొన్నారు. దీనివల్ల మెదుడులో తీవ్రమైన నొప్పి కలుగుతుందని, ఇలా ఓ తొమ్మిది మంది బాధపడుతున్నట్లు తాము గుర్తించామని సైంటిస్టులు పేర్కొన్నారు. ఇది సాధారణంగా పిల్లల్లో కనిపిస్తుందని, మెదడు, వెన్నుపాము రెండింటినీ ప్రభావితం చేస్తుందని తెలిపారు.
అలాగే, తాము పరీక్షించిన 43 మంది రోగుల్లో కొందరికి శ్వాసకోశ లక్షణాలే కనిపించలేదని వారు వెల్లడించారు. కాగా, కొవిడ్‌-19 వల్ల రోగుల్లో కలుగుతున్న దీర్ఘకాలిక నష్టం ఏంటో ఇంకా తెలియలేదని, కానీ, తమ స్టడీ ఆధారంగా వారిలో మెదడు సమస్యలను క్రమబద్ధంగా పర్యవేక్షించాల్సిన అవసరం మాత్రం ఉందని గుర్తించినట్లు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ రాస్ పాటర్సన్ పేర్కొన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకొని కరోనా చికిత్స, వ్యాక్సిన్‌ తయారీలో ముందడుగు వేయాల్సి ఉంటుందన్నారు.