నెల్లూరుజిల్లా కావలి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను చిత్ర హింసలకు గురిచేసిన భర్త అనంతరం ఇంటి ముందు ఉన్న డ్రైనేజీ కాలువలో ఆమెను పడేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లో కెళ్తే... పట్టణంలోని వెంగళరావునగర్ కు చెందిన షేక్ షరీఫ్ కు, రమ్మీజాకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. గత కొంత కాలం నుండి భార్యపై అనుమానం పెంచుకున్న షరీఫ్ తరచూ ఘర్షణ పడుతుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంటికొచ్చిన షరీఫ్ భార్య రమ్మీజాను తీవ్రంగా కొట్టాడు. కొట్టడమే కాకుండా చిత్ర హింసలకు గురిచేశాడు. భర్త చిత్ర హింసలతో అపస్మారక స్థితికి చేరిన రమ్మీజా ఇంట్లో విగతజీవిగా పడిపోగా భర్త షరీఫ్ ఆమెను ఇంట్లోంచి లాక్కొచ్చి ఇంటి ముందున్న డ్రైనేజీ కాలువలో పడేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. దీన్ని గుర్తించిన స్థానికులు 108కు సమాచారమిచ్చి కాలువలో పడి ఉన్న రమ్మీజాను బయటకు తీశారు. 108 ద్వారా కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.