లోక్సభలో ప్రశ్నించిన నెల్లూరు ఎంపీ ఆదాల

నెల్లూరు, ఫిబ్రవరి 04, (రవికిరణాలు) : దేశంలో విపరీతమైన కొరతను ఎదుర్కొంటున్న ఉల్లిపాయలను విదేశాల నుంచి కొనుగోలు చేసి రాష్ట్రాలవారీగా ఏ మేరకు పంపిణీ చేశారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు .మంగళవారం లోక్సభలో ఆయన సంధించిన ప్రశ్నకు కేంద్ర ఆహార పౌరసరఫరాల శాఖ మాత్యులు దన్వే రావు సాహెబ్ దాదారావు రాతపూర్వకంగా తన సమాధానాన్ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విదేశాలనుంచి ఉల్లిపాయలను కొనుగోలు చేసి, దేశంలోని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 49 రూపాయల నుంచి 58 రూపాయల మేరకు ధరతో  సరఫరా చేస్తోందని పేర్కొన్నారు .ఈ ఏడాది జనవరి 31 వరకు 226 కోట్ల రూపాయల ఉల్లిపాయలను సరఫరా చేసిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు 893.18 మెట్రిక్ టన్నులు, తెలంగాణకు 111.68 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామన్నారు. దేశం మొత్తానికి 2,609.95 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని పేర్కొన్నారు.