నెల్లూరు, జనవరి 31, (రవికిరణాలు) : పోలీసు శాఖ సిబ్బంది చట్టాల పై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకొని నేరాలను అరికట్టేందుకు తమ వంతు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వెంకట కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్ లోని ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో జరిగిన వార్షిక నేరాల నివేదిక సమీక్షా సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వెంకట కృష్ణయ్య పాల్గొని మాట్లాడుతూ, నేటి ఆధునిక సమాజంలో వివిధ రకాల నేరాలు జరుగుచున్నవని, పోలీసు శాఖ సిబ్బంది పూర్తి స్థాయిలో చట్టాలపై అవగాహన కల్గి, కేసు ప్రొసీజర్‌ను ఖచ్చితంగా అమలు చేసినట్లైతే నేరాలకు పాల్పడిన వారికి తగిన శిక్ష పడటంతో పాటు,బాధితులకు న్యాయం కల్గుతుందన్నారు. నేడు సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో పాటు నేరాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుచున్నవని, దానికనుగుణంగా పోలీసు సిబ్బంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంను పెంపొందించుకోవడంతో పాటు నేరాలు జరిగినప్పుడు అవసరం మేరకు ఖచ్చితమైన సాక్ష్యాలు సేకరించి సమర్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.జిల్లా కలెక్టర్ యం.వి.శేషగిరి బాబు మాట్లాడుతూ, ఎక్కడ నేరం జరిగినా లేదా ఆపద సంభవించినా ప్రజలకు తొలుత గుర్తుకు వచ్చేది. పోలీసులు అని, పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉందన్నారు. ప్రతి పోలీసు అధికారి చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్గి ఉండటంతో పాటు సమాజంలో స్నేహపూర్వక పోలీసుగా ఉండాలన్నారు. నేరం జరిగినప్పుడు బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా పోలీసు శాఖ కృషి చేయాలన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పి భాస్కర భూషణ్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 2017, 2018 మరియు 2019 సంవత్సరాలలో జిల్లాలో జరిగిన నేరాలపై పోలీసు శాఖ తీసుకున్న చర్యలపై సమగ్రంగా వివరించారు.ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పి పి.మనోహర్, జిల్లాలోని పోలీసు శాఖకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.