ఎంపీ ఆదాలకు తెలిపిన రైల్వేమంత్రి 

విజయవాడ నుంచి గూడూరు వరకు మూడో రైల్వే లైన్ పనులు సంతృప్తికరంగానే కొనసాగు తున్నాయని కేంద్ర రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ లోక్సభలో బుధవారం రాతపూర్వకంగా తెలిపారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మూడో రైల్వే లైన్ పనుల పురోగతిపై వేసిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2017లో ఈ రైల్వే లైన్ పనులు ప్రారంభమయ్యా యని, 287 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం నిర్మించేందుకు 3246 కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నామని  తెలిపారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ రైల్వే లైను పనులు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇందుకుగాను 32. 74 ఎకరాల ప్రైవేటు భూమి, 6.4 ఎకరాల ప్రభుత్వ భూమి, 1.23 ఎకరాల ఫారెస్టు భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని తెలిపారు. ఈ నిర్మాణ పనుల్లో ఎటువంటి అవకతవకలు జరగడం లేదని, ఆ విమర్శలు సహేతుకం కాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 1411 కోట్లు త్వరగా చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఏడాదికి 75.3 కిలోమీటర్ల సగటు నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉందని, ఈ మేరకు లక్ష్యం కొనసాగుతోందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి కావడానికి అనేక పరిస్థితులు దోహదం చేస్తాయని, అందువల్ల దాన్ని కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదని పేర్కొన్నారు.

 ఈ సిహెచ్ ఎస్  వైద్య సేవలు కొనసాగుతున్నాయి

మాజీ సైనికులకు (ఈ సి హెచ్ ఎస్) మాజీ సైనిక స్వచ్ఛంద వైద్య ఆరోగ్య పథకం కింద నగదు రహిత సేవలు ప్యానల్ హాస్పిటల్లో కొనసాగుతున్నాయని రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ బుధవారం లోక్సభలో రాతపూర్వకంగా తెలిపారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. మాజీ సైనికులకు ఉద్దేశించిన ఈ పథకం కింద బకాయిలు నిజమేనని ,దీనికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో పాటు ఆ హాస్పటల్ నుంచి బిల్లుల చెల్లింపునకు విజ్ఞప్తులు అందిన మాట నిజమేనని మంత్రి తెలిపారు. హాస్పిట ళ్లకు  ఈ ఆర్థిక సంవత్సరంలో 1591 కోట్ల రూపాయలను మంజూరు చేశామని తెలిపారు బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని పేర్కొన్నారు .ప్రస్తుతం 499 కోట్ల రూపాయలు చెల్లించ నున్నామని, మిగతా 1246 కోట్లు త్వరలో చెల్లిస్తామని తెలిపారు.