పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారీలో వార్డు సభ్యుల పాత్ర కీలకం

వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి

పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారీలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని చిత్తూరు జిల్లా సత్యవేడు ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి అన్నారు . బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో వార్డు సభ్యుల శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు . ముఖ్యఅతిథిగా జడ్పిటిసి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు .ఈ సందర్భంగా ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆయా వార్డుల్లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి వార్డు సభ్యుల బాధ్యత వహించాలన్నారు . ప్రధానంగా గ్రామసభల్లో వార్డు సమస్యలను చర్చించాలన్నారు .తదనుగుణంగా పంచాయతీ అభివృద్ధిపై తగిన ప్రణాళికలను రూపొందించుకోవాలి అన్నారు .తద్వారా పంచాయతీలు త్వరితగతిన అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందన్నారు . ప్రతి పంచాయతీలోనూ ముఖ్యంగా తాగునీరు , పారిశుద్ధ్యం ,వీధిదీపాలు వంటివాటిపై దృష్టి సారించాలన్నారు  .అలాగే ప్రతి వ్యక్తికి 55 లీటర్ల సురక్షిత తాగు నీటిని అందించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు .2024 నాటికి ప్రతి కుటుంబానికి పంచాయతీ కొలాయి కనెక్షన్ ఇచ్చేటట్టు పంచాయతీ పాలకమండలి శ్రద్ధ చూపాలన్నారు .దీంతోపాటు మురుగు కాలువల నిర్మాణం ,ఇంకుడు గుంతల తవ్వకాలు , జనన మరణాల నమోదు ,పారిశుద్ధ్యంలో భాగంగా తడి చెత్త పొడి చెత్తను సేకరించి బృందావనానికి తరలించడం వంటి పనుల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత వార్డు సభ్యుల పై ఉన్నట్లు ఆమె గుర్తు చేశారు . పంచాయతీ అభివృద్ధి కోసం వీలైతే స్వచ్ఛంద సేవలను వినియోగించుకోవాలన్నారు . అయితే పంచాయతీ సమావేశాల్లో వార్డు సభ్యులు తప్పనిసరిగా హాజరై సమస్యలను చర్చించడంతో పాటు వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు .అంతే తప్ప పంచాయతీ తీర్మానాల్లో వార్డు సభ్యులు గుడ్డిగా సంతకాలు చేయడం అభివృద్ధికి దోహద పడదన్నరు . అంతకుమునుపు ఎంపీపీ ప్రతిమ ,జెడ్పిటిసి విజయలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు .అనంతరం జ్ఞానంపై తెలుగు గంగ డిఈ ఓబుల్దాస పలు అంశాలపై వివరించారు .వార్డు సభ్యుల విధులు ,బాధ్యతలు వంటి పలు అంశాలపై వీడియో ప్రజంటేషన్ ద్వారా చూపించడం జరిగింది .పంచాయతీ చట్టం ద్వారా పంచాయతీ పాలక మండలి సభ్యులకు ప్రజాస్వామ్యబద్ధంగా ,చట్టబద్ధంగా కల్పించిన అధికారులపై రిసోర్స్ పర్సన్ రమణ మూర్తి శైలేంద్ర కుమార్ , కరుణాకర్ , ప్రకాష్ , రామలింగం తదితరులు వార్డు సభ్యులకు వివరించారు .వార్డు సభ్యుల శిక్షణ ఎంపీడీవో కార్యాలయం ,వైఎస్సార్ ఇందిరా క్రాంతి పథం ,ఎంఆర్సి కేంద్రాలలో జరిగింది .ఒక్కో బ్యాచ్కి రెండు రోజులపాటు శిక్షణ కొనసాగనుంది .మొత్తం ఆరు బ్యాచ్లకు నాలుగు రోజులు పాటు శిక్షణ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేంద్రనాథ్ ,పంచాయతీ సెక్రటరీలు ,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు .