- కమిషనర్ పివివిస్ మూర్తి


క్యూ లైన్లలో పడిగాపులు పడుతూ ఎదురుచూపులు చూసే వృద్ధులు, దివ్యంగుల సమస్యలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలుచేస్తున్న 'ఇంటికే పెన్షను' విధానంపట్ల లబ్ధిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని, పెన్షను పంపిణీ ప్రక్రియను నగరంలో విజయవంతంగా పూర్తి చేశామని కమిషనర్ పివివిస్ మూర్తి ప్రకటించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా కమాండ్ కంట్రోల్ విభాగంలో పలువురు అర్జీదారుల నుంచి వినతిపత్రాలను ఆయన సోమవారం స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ పరిధిలో అర్హులైన 40,500మంది లబ్ధిదారుల నివాసాలకు వెళ్లి పెన్షను నగదును వలంటీర్ల ద్వారా 1వ తేదీనే అందజేసామని తెలిపారు. లబ్ధిదారులు నివాసంలో లేకపోవడం, గృహానికి తాళం వేసి ఉండటం, వేలిముద్రలు, ఐ రిస్ యంత్రాల్లో వివరాలు నమోదుకాకపోవడం వంటి చిన్న సమస్యలకు పరిష్కారం కల్పించి పెన్షను నగదును అందిస్తామని కమిషనర్ స్పష్టం చేసారు. పెన్షనుల పంపిణీ ప్రక్రియపై వార్డు సచివాలయ కార్యదర్శులు, వలంటీర్లకు చక్కటి అవగాహన పెంచి రాబోవు కాలంలో వ్యవస్థ అందించే సేవలను మరింత సులువుతరం చేసేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. స్పందన కార్యక్రమంలో అధికంగా ఇంటి పన్నులు వస్తున్నాయన్న ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులోపు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు.