సర్వేపల్లి : నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలం తోడేరు గ్రామం వద్ద కండలేరు ఎడమ గట్టు కాలువకు పడిన గండిని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డిఅధికారులు, రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా కాకాని మాట్లాడుతూ, …ఈ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. తాము 22 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కండలేరు ఎడమ కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేశామని, కండలేరు ఎడమ కాలువ ద్వారా రైతాంగానికి 150 క్యూసెక్కులకు 40 క్యూసెక్కులు అదనంగా సాగునీటిని విడుదల చేశామన్నారు.
230 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న ఈ కాలువ 190 క్యూసెక్కుల నీటికే గండి పడిందని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నిర్వహణ పనులు చేపట్టక ఈ కాలువకు గండి పడిందన్నారు. గతంలో అధికారంలో ఉన్న ప్రబుద్ధులు రైతులకు అవసరమైన కాలువలకు మరమ్మతులు చేయాలని గాని, నిర్వహణ పనులు చేపట్టాలని గానీ ఆలోచన చేయని పరిస్థితినెలకొందన్నారు.
నీరు – చెట్టు పథకం కింద అవసరం లేని, అనవసరమైన పనులు చేపట్టి ప్రజాధనం దోచుకున్నారు తప్ప, రైతాంగానికి అవసరమైన పనులు ఏ ఒక్కటి చేపట్టలేదన్నారు.ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేశామని, డెల్టాకు దీటుగా అభివృద్ధి చేశామని గత పాలకులు చెప్పుకున్నారే తప్ప రైతాంగానికి మేలు చేసిందేమీ లేదన్నారు. సాఫీగా సాగునీరు అందించేందుకు రైతులతో కలసి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ సీజన్ పూర్తయిన వెంటనే కండలేరు ఎడమ కాలువ లైనింగ్ పనులు ప్రారంభించేందుకు నిధులు మంజూరు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరానన్నారు.
నిధులు మంజూరు కాగానే లైనింగ్ పనులు పూర్తిచేసి శాశ్వత ప్రాతిపదికన సాగునీరు అందిస్తామని ఈ సందర్బంగా అయన తెలిపారు. లైనింగ్ పనులతో పాటు అవసరమైన చోట క్రాస్ రెగ్యులేటర్ లను కూడా ఏర్పాటు చేసి, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని, రైతులు, అధికారులను సమన్వయపరుచుకొని రైతులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా, అవరోధాలను అధిగమిస్తూ, సాఫీగా సాగునీరు అందిస్తున్నామన్నారు.
గత పాలకుల మాదిరిగా “అవసరాల కోసమో, అవకాశాల కోసం కాకుండా” ఈ ప్రాంత రైతుల అభివృద్ధి కోసం పని చేస్తున్నామని,
రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసేందుకు అవసరమైన చోట అదనపు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అర్హులైన ఏ ఒక్క రైతుకి అన్యాయం జరగకుండా రైతు భరోసా పథకం అందించే బాధ్యత తనదన్నారు. రైతాంగానికి సాఫీగా సాగునీరు అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువకులకు కాకాణి అభినందనలు తెలిపారు.