జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో సోమవారం భీకర ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఉగ్రవాదుల ఏరివేతకు వెళ్లిన భద్రతా సిబ్బందిపై ముష్కరులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆర్మీ అధికారి సహా ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.

పూంఛ్‌ జిల్లాలోని సురాన్‌కోట్‌ ప్రాంతంలో కొందరు వాస్తవాధీనరేఖను దాటి చర్మేర్‌ అటవీ ప్రాంతంలోకి చొరబడినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో సోమవారం తెల్లవారుజామున భద్రతాసిబ్బంది అటవీ ప్రాంతానికి వెళ్లి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ముష్కరులు భద్రతాసిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఎదురుకాల్పుల్లో జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి, మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. ముష్కరులు నక్కిన అటవీ ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు అడవిలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోందని రక్షణశాఖ ప్రతినిధులు వెల్లడించారు.

ఇద్దరు ఉగ్రవాదుల హతం..

ఇదిలా ఉండగా.. కశ్మీర్‌ లోయలో సామాన్య పౌరులపై జరుగుతున్న దాడులకు అరికట్టేందుకు భద్రతాసిబ్బంది చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం కశ్మీర్‌లోని బందిపొరా జిల్లా గుండ్‌ జహాంగీర్‌, అనంత్‌నాగ్‌లోని ఖాగుండ్‌లో వేర్వేరుగా నిర్వహించిన ఎన్‌కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ పోలీసుకు గాయాలయ్యాయి. బందిపొరాలో మృతి చెందిన ఉగ్రవాదిని ఇంతియాజ్‌ అహ్మద్ దార్‌గా గుర్తించారు. అతను లష్కరే తయిబా అనుబంధ సంస్థ 'ది రెసిస్టెన్స్ ఫోర్స్‌'కు చెందినవాడని కశ్మీర్‌ పోలీసులు తెలిపారు. ఇటీవల బందిపొరాలోని షాగుండ్‌లో జరిగిన పౌరుల హత్య కేసులో దార్ ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారు.