తమిళంలో ఘన విజయాన్ని నమోదు చేసుకున్న 'అసురన్‌' చిత్ర దర్శకుడు వెట్రిమారన్‌ మరో సినిమాకు సిద్ధమైపోయాడు. అసురన్‌ హిట్‌తో మంచి ఫామ్‌లో ఉన్న ఈ దర్శకుడు తన తదుపరి సినిమా తమిళ స్టార్‌ సూర్యతో చేయబోతున్నాడని కోలీవుడ్‌ పరిశ్రమ కోడై కూసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్షరాలా అదే జరగబోతుంది. గత కొంతకాలంగా సరైన హిట్లు అందుకోలేకపోతున్న సూర్యతో వెట్రిమారన్‌ సినిమా చేయనున్నాడు. వి క్రియేషన్స్‌ బ్యానర్‌పై కలైపులి ఎస్‌ థను ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.
'దర్శకుడు వెట్రిమారన్‌ తొలిసారి సూర్య తో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రంలో నేను భాగస్వామినైనందుకు ఆనందంగా ఉంది' అని నిర్మాత ఎస్‌ థను పేర్కొన్నాడు. కాగా ఇది సూర్యకు 40వ సినిమా కావడం విశేషం. సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మరి వీరి కాంబినేషన్‌ సూర్యకు కలిసొస్తుందో లేదో చూడాలి.

కాగా సూర్య తాజాగా నటించిన 'సూరరై పోట్రు' వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో సూర్య తొలిసారిగా రాప్‌ సాంగ్‌ పాడాడు. ఇది తెలుగులో 'ఆకాశమే నీ హద్దురా' పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా ద్వారానైనా సూర్య తన అభిమానులకు గిఫ్ట్ ఇస్తాడో, నిరాశ కలిగిస్తాడో వేచి చూడాలి.