నెల్లూరు ఎంపీ ఆదాలకు కేంద్రం జవాబు 

రానున్న మూడేళ్లలో అంటే 2022 డిసెంబర్ నాటికి దేశంలో లక్ష మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని కేంద్రం ఒక లక్ష్యంగా నిర్ణయించిందని కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్కె సింగ్ లిఖితపూర్వకంగా గురువారం లోక్సభలో తెలిపారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, దేశంలో సౌర శక్తి ఉత్పత్తి గురించి, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రంలో మూడేళ్లలో ఏ విధమైన లక్ష్యాలను నిర్దేశించిందని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పైవిధంగా సమాధాన మిచ్చారు. జాతీయ సౌర విద్యుత్ సంస్థ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లను కలుపుకొని దాదాపు 750 గిగా వాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నట్లు అంచనా వేసిందని పేర్కొన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ 38.44, తమిళనాడు 17.67 గిగా వాట్ల ఉత్పత్తి  చేయగలవని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జనవరి 31 నాటికి 34,035 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతున్నట్లు పేర్కొన్నారు. వివిధ పథకాల కింద సౌర విద్యుత్తుకు గానూ 2018 -19 లో  2,524 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలిపారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ సౌర విద్యుత్తు ఉత్పత్తి లో ప్రధాన రాష్ట్రాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.