తల్లీకూతుళ్ల హత్యకేసులో ఇంతియాజ్‌కు ఉరిశిక్ష !
నెల్లూరు, పిబ్రవరి 06, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లాలో కలకలం రేపిన మర్డర్‌ కేసులో సంచలన తీర్పునిచ్చింది కోర్టు. 2013 ఫిబ్రవరి 12న జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడు ఇంతియాజ్‌కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. నగరంలోని వాగ్దేవి డి-ఫార్మసీ కళాశాల కరెస్పాండెంట్‌ దినకర్‌ రెడ్డి, స్థానిక హరనాథపురంలో భార్య, కుమార్తెతో నివాసం ఉండేవారు. ఆయన కుమార్తె భార్గవి ఎంబీబీఎస్‌ చదువుతోంది. 2013 ఫిబ్రవరి 12న దినకర్‌రెడ్డి నూతన గృహానికి సంబంధించిన ప్లాన్‌ ఇచ్చేందుకు వచ్చిన ముగ్గురు శకుంతల, భార్గవిపై కత్తులు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు.ఈ ఘటనలో తీవ్ర గాయాలైన తల్లీకూతురు 
కిందపడిపోయారు. వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. భార్గవి, తల్లి శకుంతల హత్యకేసులో ముగ్గురిపై కేసు నమోదైంది. ప్రధాన నిందితుడు ఇంతియాజ్‌ ఇప్పటికే పలు హత్య కేసుల్లో నిందితుడు. గతంలో రెండు కేసులు కొట్టివేశారు. ఇప్పటికే ఈ కేసులో జువైనల్‌ కోర్టులో మూడేళ్లుగా ఇద్దరు మైనర్లు మూడేళ్ల శిక్ష అనుభవిస్తున్నారు. నిందితుడు షేక్‌ ఇంతియాజ్‌కు ఉరిశిక్ష విధిస్తూ ఎనిమిదో అదనపు న్యాయమూర్తి సత్యనారాయణ తీర్పునిచ్చారు.