నెల్లూరు ఎంపీ ఆదాలకు కేంద్ర మంత్రి సమాధానం


దేశంలోని రాష్ట్ర, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉందని ఆర్బీఐ ప్రశంసించి నట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లోక్సభలో రాతపూర్వకంగా సోమవారం తెలిపారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి దేశంలోని కేంద్ర సహకార బ్యాంకుల పరిస్థితి గురించి అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా జవాబు చెప్పారు. అలాగే ఈ బ్యాంకుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటోందని కూడా ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి సమాధానం చెబుతూ సహకార వ్యవస్థను పటిష్టపరిచేందుకు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంకు (నాబార్డు) పలు చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.రుణ పంపిణీ, వసూళ్ల కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 33 రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్రాల్లో 363 సహకార బ్యాంకులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి ఏడాది రుణ కేటాయింపు మొత్తం పెరుగుతోందని తెలిపారు. ఇందులో ఎక్కువ భాగం బ్యాంకులు లాభాల్లో ఉన్నాయని స్పష్టం చేశారు.