కరోనా నేపథ్యంలో ఆరు వారాలు వాయిదా
అత్యున్నత స్థాయి సంప్రదింపుల తరువాతే నిర్ణయం 
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ రమేశ్ కుమార్

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. కరోనా ప్రభావం ఎన్నికలపైనా ఉందని, ఎలక్షన్ సమయాల్లో ప్రచారం, పోలింగ్ సందర్భంగా ప్రజలు పెద్దఎత్తున సమూహంలా చేరే అవకాశాలు ఉన్నందున ఆరు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ రమేశ్ కుమార్ ప్రకటించారు.వాస్తవానికి కరోనాతో ఎన్నికలకుఇబ్బంది రాదని ముందు భావించామని అయితే, కేంద్రం కూడా కరోనాను జాతీయ విపత్తుగా గుర్తించిందన్న ఆయన, స్థానిక ఎన్నికలను వాయిదా వేయడానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు. అత్యున్నత స్థాయి సంప్రదింపులు జరిపి, పరిస్థితులను మదింపు చేసి, ప్రభుత్వ ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత తిరిగి ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు.కాగా, ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియ, నామినేషన్లు ఏవీ రద్దు కాబోవని స్పష్టం చేసిన ఆయన, ఏకగ్రీవంగా ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు విజేతలేనని, వారు కొనసాగుతారని రమేశ్ కుమార్ వెల్లడించారు. ఈ ఆరు వారాల పాటు కలెక్టర్లు, తహసీల్దార్లు ఎన్నికలు జరిగే ప్రాంతాలను నిశితంగా పరిశీలిస్తుంటారని, అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హఎచ్చరించారు.