- కమిషనర్ పివివిస్ మూర్తి


నగర పాలక సంస్థ పరిధిలోని 54 డివిజనుల్లో ప్రస్తుతం అమలు చేస్తున్న చెత్త సేకరణ/తొలగింపు పద్ధతిని మరింత మెరుగు చేస్తూ శాస్త్రీయ విధానంలో నూతన ప్రణాళికలను సిద్ధం చేశామని కమిషనర్ పివివిస్ మూర్తి ప్రకటించారు. స్థానిక బారా షహీద్ దర్గాలోని ముసాఫిర్ ఖానా ప్రాంగణంలో వార్డు పారిశుద్ధ్య సెక్రటరీలు, సానిటరీ సిబ్బందికి నూతన విధానాలపై అవగాహనా సదస్సును శుక్రవారం నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న కమిషనర్ మాట్లాడుతూ ప్రతీ వార్డులో 350 కుటుంబాలను ఒక విభాగంగా నిర్దేశించి, పారిశుద్ధ్య కార్మికుల ద్వారా నేరుగా గృహాల నుంచి వంద శాతం చెత్త సేకరించేలా నూతన విధానం అమలు చేస్తున్నామని తెలిపారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగు పరిచేందుకు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు అనుగుణంగా నూతన శాస్త్రీయ విధానాలను అమలుచేయనున్నామని తెలిపారు. చెత్తను ఎరువుగా మార్చే యాంత్రికతపై అవగాహన పెంచుకుని, నగరంలోని హోటళ్లు, కూరగాయల మార్కెట్లు తదితర వాణిజ్య సముదాయాలు అలాంటి సాంకేతికత కలిగిన మెషీన్లను వినియోగించాలని సూచించారు. నూతనంగా మురళీకృష్ణ హోటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కంపోస్టు మెషిన్ పనితీరు, ఫలితాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు అన్ని హోటళ్ల యజమానులను ఆహ్వానిస్తున్నామని, పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా అన్ని సంస్థలూ కంపోస్టు మెషీన్లు వాడేలా అవగాహన పెంచుతామని కమిషనర్ పేర్కొన్నారు. స్వంత ఇంటి వ్యర్ధాలను ఎరువుగా మార్చే ప్రక్రియను ప్రతీ గృహిణికి వార్డు సచివాలయ కార్యదర్శుల ద్వారా వివరించి, పారిశుద్ధ్య నిర్వహణపై చైతన్యం పెంచుతామని కమిషనర్ ప్రకటించారు.