నెల్లూరు జిల్లా కోవూరులో క్రికెట్ గ్రౌండ్ లో చేతబడి కలకలం రేపింది. కోవూరు మండలం పడుగుపాడులో ఈ ఘటన జరిగింది. పడుగుపాడులో క్రికెట్ మైదానంలో సోమవారం(ఫిబ్రవరి 17,2020) అర్థరాత్రి క్షుద్రపూజలు జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. మైదానంలో పెద్ద బొమ్మ గీసిన మంత్రగాళ్లు.. నల్లకోడిని బలిచ్చారు. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఇది ఎవరి పనో తెలుసుకునే పనిలో పడ్డారు. కాగా, చేతబడి జరగడంతో ఏదన్నా అరిష్టం జరుగుతుందేమోనని స్థానికులు భయపడుతున్నారు. ఈ పని చేసిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

స్థానిక యువకులు మైదానంలో క్రికెట్ ఆడుతుంటారు. ఎప్పటిలాగే మంగళవారం గ్రౌండ్ కి వెళ్లారు. అక్కడ పెద్ద బొమ్మ, బలిచ్చిన నల్ల కోడిని చూసి షాక్ తిన్నారు. క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించడంతో భయంతో పరుగు తీశారు. గ్రామంలోకి వెళ్లి అందరికి విషయం చెప్పారు. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్షుద్రపూజలు ఎవరు చేశారు, ఎందు కోసం చేశారు అనే వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులున్నారు

 ఇది గ్రామంలో ఉండే వారే చేశారా? లేక బయటి నుంచి వచ్చిన వ్యక్తుల పనా? అనేది తెలియాల్సి ఉంది. బయటి వ్యక్తులకు గ్రామస్తులు సహకరించారా అనే కోణంలోనూ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. త్వరలోనే మిస్టరీ చేధిస్తామని పోలీసులు తెలిపారు. ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుని ఈ బాణామతి చేసి ఉండొచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. గుప్తనిధుల కోసం ఈ క్షుద్ర పూజలు చేసి ఉండొచ్చని మరికొందరు గ్రామస్తులు సందేహం వ్యక్తం చేశారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులను ఒక్కొక్కరిగా విచారిస్తున్నారు. అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు.