యువతలోని శక్తియుక్తులను, నైపుణ్యాలను వెలికితీసి వారిని జాతి నిర్మాణంలో పాలు పంచుకునే విధంగా తీర్చిదిద్దడమే నైబర్హుడ్ పార్లమెంట్ ప్రోగ్రాం ఉద్దేశ్యమని ముఖ్యఅతిథిగా విచ్చేసిన బ్రేక్ ఇన్స్పెక్టర్ కె. మురళీమోహన్ పేర్కొన్నారు. నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సూళ్లూరుపేటలోని ఎస్ వి ఎస్ ఎస్ సి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు సూళ్లూరుపేట బ్లాక్ లెవెల్ నైబర్హుడ్ పార్లమెంటు ప్రోగ్రాం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం  యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వశాఖ నూతనంగా ప్రవేశపెట్టిన నేషనల్ యంగ్ లీడర్స్ ప్రోగ్రాం అనే కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా భారతదేశంలోని 623 జిల్లాల్లోనూ కార్యక్రమం జరుగుతూవుంది. గ్రామస్థాయిలో యువత తమ  సమస్యలను స్థానిక పరిపాలనాంశాల ద్వారా పరిష్కరించుకునేందుకు ఒక వేదికను తయారుచేయుట దీని లక్ష్యాలలో ఒకటని తెలియజేశారు. డిప్యూటీ తహశీల్దారు (సూళ్లూరుపేట) జె. స్వప్న మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ యువజన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా యువత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని యువజన సంఘాల బలోపేతానికి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొనుటకు వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల సహాకారంతో వివిధ మండలాల్లో సమస్యల పరిష్కారమునకు సూచనలు, మార్గదర్శకాలను రూపొందించడం జరుగుతుందని వివరించారు. తొలుత.. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం యువతకు యోగాసనాలను ప్రదర్శించి యోగా ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. మురళీమోహన్ రాజు, మోటివేటర్ టి. వెంకటేశ్వర్లు, మున్సిపాలిటీ ప్లానింగ్ ఆఫీసర్ బి. ప్రవీణ్ కుమార్, నెహ్రూ యువకేంద్ర డిస్ట్రిక్ యూత్ కో ఆర్డినేటర్ ఆకుల మహేందర్రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె. శివప్రసాద్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వి. సుధాకర్ రావు, లెక్చరర్ నయంతుల్లా, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.