హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ నిర్లక్ష్యంగా పట్టాలు దాటుతున్న ఓ విద్యార్ధి పట్ల రైలు మృత్యువైంది. పాటలు వింటూ మైమరచిన విద్యార్ధి రైలు రావడాన్ని గమనించకపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నెల్లూరులో ఈ విషాదం జరిగింది. బుచ్చిరెడ్డి పాళెం ప్రాంతానికి చెందిన రామ్ ప్రతాప్ రెడ్డి అనే విద్యార్ధి నెల్లూరులోని విఆర్ లా కళాశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. రోజూ బస్సులో నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ కు వచ్చి అక్కడి నుండి కళాశాలకు నడుచుకుంటూ వెళ్లే వాడు. ఎస్-2 థియేటర్ ఎదురుగా ఉన్న ప్రాంతం నుండి రైలు పట్టాలు దాటి కళాశాలకు చేరుకునే వాడు. ఇదే క్రమంలో సోమవారం ఉదయం కూడా నెల్లూరుకు చేరుకున్న రామ్ ప్రతాప్ రెడ్డి హెడ్ ఫోన్స్ చెవుల్లో పెట్టుకుని సెల్ ఫోన్ ద్వారా పాటలు వింటూ పట్టాలు దాటే ప్రయత్నం చేశాడు. పాటలు వినే క్రమంలో రైలు రావడాన్ని గమనించకపోవడంతో రైలు ఢీ కొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. కొందరు దీన్ని గమనించి అక్కడకు చేరుకుని పరిశీలిస్తుండగా మరో వృద్దుడు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.