కరోనా వైరస్ తో జాగ్రత్త వహిద్దాం

నెల్లూరు, పిబ్రవరి 11, (రవికిరణాలు) : కరోనా వైరస్ తో చైనా దేశం భయబ్రాంతులకు గురైందని ఈ వైరస్తో చైనాలో గత ఆదివారం ఒక్కరోజే ఏకంగా 97 మంది మరణించారని.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున విచ్చేసిన అబ్దుల్ మోయిన్ పేర్కొన్నారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు సమగ్ర గ్రామీణాభివృద్ధి సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఎస్.వి.ఆర్ స్కూలు విద్యార్థులచే జాకీర్ హుస్సేన్ నగర్ నుండి సత్యనారాయణపురం సెంటర్ వరకు కరోనా వైరస్ పై అవగాహన ర్యాలీ మరియు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ ప్రబలిన తరువాత ఒకే రోజు ఇంత మంది మృత్యువాత పడటం ఇదే తొలిసారి, కరోనా వైరస్ గబ్బిలాలు పాముల నుండి మనిషికి వ్యాపిస్తుందని  తరువాత గాలి ద్వారా అత్యంత వేగంగా మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుందని తెలియజేశారు. వ్యక్తిత్వ వికాస నిపుణులు కరిమద్దెల నరసింహారెడ్డి మాట్లాడుతూ.. దగ్గు, తుమ్ములు, ముక్కునుండి నీరు కారడం వంటి లక్షణాలు ఉన్న వారికి దూరంగా ఉండాలి, దగ్గినా తుమ్మినా జేబులో  రుమాలు పెట్టుకుని వినియోగించాలి, కరోనా వైరస్తో బాధపడడం కన్నా ముందస్తు జాగ్రత్త మిన్న అని అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో  స్కూలు కరస్పాండెంట్ అందె శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ బి. రమేష్ బాబు, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. మురళీమోహన్ రాజు, గౌరవాధ్యక్షుడు టి. వెంకటేశ్వర్లు, ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ వి సురేష్ బాబు, గీతామయి వృద్ధాశ్రమ అధినేత తమ్మినేని పాండు, లెక్చరర్ క్రాంతికుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది షఫీ హిదాయత్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.