ఏపీ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ వార్తల్లో నిలిచే నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చిక్కుల్లో పడ్డారు. ఆయన ఇంటితో పాటు వ్యాపార సంస్థల్లో ఆదాయపన్ను శాఖ(ఐటీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయన ఇంటితో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏడు ప్రాంతాల్లో ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈరోజు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఉదయం ఆరు గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఆయన వ్యాపారాలకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నాయి. ఇందు, భారత్‌ సహా పలు కంపెనీల డైరెక్టర్ల నివాసాల్లోనూ ఈ సోదాలు సాగుతున్నట్లు సమాచారం. సాయంత్రం తర్వాత ఐటీ దాడులపై అధికారులు వివరాలు విడుదల చేసే అవకాశముంది. వైసీపీ టికెట్‌పై గెలిచిన రఘురామకృష్ణంరాజు సొంత పార్టీపైనే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు. దీంతో వైసీపీ నేతల నుంచి తనకు హాని ఉందని ఆయన కేంద్రాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించింది.