ప్రయాణికు రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న 100 మార్గాల్లో 150 ప్రైవేటు రైళ్లను నడిపించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మొదటి ప్రయివేటు రైలును తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టించనుంది. హైదరాబాద్ పరిధిలోని లింగంపల్లి నుంచి తిరుపతి మధ్య రైలును నడిపించనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య వెంకటాద్రి, నారాయణాద్రి, పద్మావతి, రాయలసీమ ఎక్స్ ప్రెస్, కృష్ణా ఎక్స్ ప్రెస్, శబరి ఎక్స్ ప్రెస్ ఇలా మొత్తం 8 రైళ్లు నడుస్తున్నాయి. కాగా ఈ రైళ్లలో ఎప్పటికప్పుడు రద్దీ పెరిగిపోతుండడంతో ప్రయివేటు వాహనాల ద్వారా, బస్సుల ద్వారా తిరుపతికి ప్రయాణం చేస్తున్నారు భక్తులు.అంతే కాక కొన్ని సందర్బాల్లో సాధారణ రైల్లతో పాటు ప్రత్యేక రైళ్లను కూడా రైల్వేశాఖ నడిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరో కొత్త ప్రయివేటు రైలును తిరుపతికి నడిపించనున్నారు. ఇందులో భాగంగానే ఐదు నెలల క్రితం న్యూఢిల్లీ నుంచి లక్నో మధ్య, ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య ప్రారంభం అయి ఎంతో ఫేమస్ అయిన తేజస్ రైలును లింగంపల్లి నుంచి తిరుపతికి నడిపించనున్నారు. ఇకపోతే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 11 ప్రైవేటు రైళ్లకు అనుమతి లభించగా అందులో మొదటి టెండర్ తిరుపతికి ప్రయాణించే రైలుకు ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిపారు.అతి త్వరలో ఇండోర్ నుంచి వారణాసి మధ్య కూడా తేజస్ నడవనుంది. ఈ రైళ్లలో సీట్లు నిండుతున్న కొద్దీ ధర పెరుగుతూ ఉంటుంది. కానీ ఏదైనా కారణం వలన ఈ రైలు గమ్యాన్ని చేరడానికి ఆలస్యం జరిగితే ఐఆర్ సీటీసీ ప్రయాణికులకు నుంచి ప్రయాణికులకు రూ. 250 వరకూ పరిహారం లభిస్తుంది. ఇప్పటికే ఈ తేజస్ రైలు రెండుసార్లు ప్రయాణికులకు పరిహారాన్ని చెల్లించింది. ఈ నేపథ్యంలో ఐఆర్సీటీసీపై భారాన్ని తొలగించేందుకు ప్రైవేటు రైళ్లు వస్తుంటే, మిగతా రైళ్లను మరింత ఆలస్యంగా నడిపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.