లోక్సభలో ప్రశ్నించిన నెల్లూరు ఎంపీ ఆదాల

నెల్లూరు, పిబ్రవరి 06, (రవికిరణాలు) : ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో సూక్ష్మ, చిన్న ,మధ్య తరహా పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లలో ఎలాంటి  సడలింపు ఇచ్చిందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. లోక్సభలో గురువారం ఆయన వేసిన ఈ ప్రశ్నకు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ  రాత పూర్వకంగా జవాబు నిస్తూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాన్ని ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ సహాయ పథకాన్ని ప్రకటించిందని తెలిపారు. కోటి రూపాయలకు లోగా ఉండే రుణాలపై 2 శాతం వడ్డీని తగ్గించిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక
మాంద్యం కారణంగా వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టి వ్యాపార వర్గాలను, సంస్థలను కుదేలు చేశాయని తెలిపారు. వ్యాపారుల్లో జీవించే సామర్థ్యాన్ని పెంచేందుకు గాను తాము ప్రకటించిన వడ్డీ సహాయ పథకం ఎంతగానో తోడ్పడుతుందని స్పష్టం చేశారు.