శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాబోగోలు మండలంలోని జువ్వలదిన్నె తీరప్రాంతంలో ఏర్పాటుకానున్న ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టుతో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభించి, మరిన్ని పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ శ్రీ  

కెవిఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను  రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీ కరికాల వలవన్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు త్వరలో మరిన్ని ప్రాజెక్టులు రానున్నాయని, వీటి ద్వారా పారిశ్రామికంగా అభివృద్ధి చెంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ముఖ్యంగా జువ్వలదిన్నె లో 76 ఎకరాల్లో చేపడుతున్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణంలో వరదల సమయంలో మత్స్యకారులకు ఎంతో అనుకూలంగా ఉండేలా డిజైన్ ను రూపొందించినట్లు పేర్కొన్నారు. వీలైనంత త్వరలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జువ్వలదిన్నె రూపురేఖలు మారి మత్స్యకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. శ్రీ కరికాల వలవన్ మాట్లాడుతూ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించి నిధులు మంజూరు చేయడంతో పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు.  తీరప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తుందన్నారు.రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు.రెండేళ్లలో ఈ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. 1250 బోట్లు నిలబడే విధంగా బెర్తులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 

 అనంతరం దగదర్తి వద్ద చేపడుతున్న విమానాశ్రయ నిర్మాణ పనులను కలెక్టర్, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రధాన ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్  పరిశీలించారు.

  ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కావలి రెవిన్యూ డివిజనల్ అధికారి శీనానాయక్, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ నాగేశ్వర రావు, బోగోలు తాసిల్దార్ వెంకట్రామిరెడ్డి,ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.