వెంకటగిరి, జనవరి 02, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా వెంకటగిరి మండల పరిధిలోని అక్బర్ నివాస కండ్రిగ గ్రామంలో గత మంగళవారం రోజున భార్య పై (ఇండ్ల సునీత) అనుమానంతో రోకలి బండతో మోది హత్య చేసి పరారైన భర్త ఇండ్ల చెంచుకృష్ణయ్యని పోలీసులు అరెస్ట్ చేశారు. మనుబోలు మండలం మడమనూరు కి చెందిన ఇండ్ల చెంచుకృష్ణయ్యతో పది సంవత్సరాలు క్రితం సునీత కి వివాహం జరిగింది. సునీత గ్రామ వాలంటీర్ గా ఉద్యోగం చేసుకుంటున్న క్రమంలో భర్త చెంచుకృష్ణయ్య ఆమె పై అనుమానం పెంచుకుని తరచూ గొడవపడేవాడు. దీంతో ఆమె తన అమ్మగారి ఇల్లు అయిన అక్బర్ నివాస కండ్రిగకి తన ఇద్దరు పిల్లలతో కలసి వచ్చి తలదాచుకుంటున్న సమయంలో భార్యని ఎలాగైనా చంపాలని అనుకున్న చెంచుకృష్ణయ్య అక్కడికి వచ్చి ఆమెతో గోడవపడి వెనుకవైపు నుండి వచ్చి రోకలి బండతో కొట్టి చంపి పరారయ్యాడు. దర్యాప్తులో భాగంగా హంతకుడు నాయుడుపేట రోడ్డు మార్గంలో ఉన్నాడనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకుని కోర్టుకి హాజరుపరుస్తున్నామని సర్కిల్ సీఐ అన్వర్ భాషా తెలిపారు.