అబుదాబి వేదికగా గతరాత్రి బెంగళూరుతో తలపడిన మ్యాచ్‌లో ముంబయి బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(79*) చెలరేగడంతో ఆ జట్టు సునాయాస విజయం సాధించింది. దాంతో ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి టీమ్‌గా ముంబయి నిలిచింది. ఈ నేపథ్యంలోనే ముంబయి ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్‌ పూర్తికాగానే బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. సూర్యకుమార్‌ వద్దకెళ్లి స్లెడ్జింగ్‌ చేశాడని సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్‌గా మారింది.

డేల్‌ స్టెయిన్‌ వేసిన 13వ ఓవర్‌లో ఒక లెగ్‌బైస్‌ రావడంతో పాటు సూర్యకుమార్‌ మూడు ఫోర్లు కొట్టాడు. దాంతో అతడు 40 పరుగులకు చేరుకొని ప్రమాదకరంగా మారుతున్నాడు. అప్పటికి ముంబయి స్కోర్‌ 99/3. బెంగళూరుకు కూడా విజయావకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కోహ్లీకి కోపం వచ్చి సూర్య వద్దకు వెళ్లాడు.

అప్పుడే ముంబయి బ్యాట్స్‌మన్‌ బెంగళూరు కెప్టెన్‌ను పట్టించుకోకుండా పక్కకు తప్పుకున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. కోహ్లీ స్లెడ్జింగ్‌ చేశాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.