నెల్లూరు, జనవరి 08, (రవికిరణాలు) : పెండింగ్ లో వున్న కోర్టు కేసులపై ప్రత్యేకశ్రద్ధ వహించి వీలైనంత త్వరగా పరిష్కరించడానికి తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు ఎం.వి. శేషగిరిబాబు అన్నారు. బుధవారం స్థానికజిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయంలో నెల్లూరుజిల్లా సంయుక్త కలెక్టరు, సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులతో పెండింగ్ లో వున్న కోర్టు కేసుల గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 490 కోర్టు కేసులు పెండింగులో వున్నాయని, సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు వారి పరిధిలో వున్న కోర్టు కేసులకు సంబంధించి కౌంటరు అఫిడవిట్, పేరా వైజ్ రిమార్కులు సకాలంలో కోర్టుకు సమర్పించాలన్నారు. ప్రతి శనివారం కోర్టు కేసుల గురించి డివిజనల్ కార్యాలయాల్లో సమావేశం నిర్వహించాలన్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి రిట్ పిటీషన్లు ఏవైనా కోర్టులో పెండింగ్ లో వుంటే వాటి పై ప్రత్యేక శ్రద్ధ వహించి వీలైనంత త్వరగా జడ్జి మెంట్ వచ్చేలా చూడాలన్నారు. స్థానిక కోర్టులో గాని, హైకోర్టులో గాని పెండింగులో వున్న కేసులపై ఏవిధ మైన చర్యలు తీసుకుంటున్నారు అనే విషయమై అధికారుల నుండి వివరాలు సేకరించారు. కోర్టులో కేసు ఫైలు అయిన దగ్గర నుండి పేరా వైజ్ రిమార్కులు పంపుట వరకు దశల వారీగా ప్రతి కేసు గురించి వివరాలు పంపాలన్నారు. భూమి విలువ ఎక్కువగా వున్న కేసుల గురించి వారానికొకసారి లేక 15 రోజులకొకసారి సమీక్షించుకొని ప్రత్యేకమైన రిజిష్టరు పెట్టి కేసులన్ని నమోదు చేయాలన్నారు. ప్రతి కేసులో కౌంటరు ఫైలు గురించి అవగాహన వుండాలన్నారు. కోర్టు కంటెంట్ కేసులు ఏమైనా పెండింగులో వున్నాయా అని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సబ్ కలెక్టరు, ఆర్.డి.ఓ. ఆఫీసుల నుండి కోర్టు కేసులకు సంబంధించి నోడల్ అధికారులను పెట్టుకోవాలన్నారు. హైకోర్టు,జిల్లా కోర్టు లోకల్ కేసులకు వేరు వేరు రిజిష్టర్లు పెట్టాలన్నారు. ఈనాం కేసులు, తెలుగుగంగకు సంబంధించి పెండింగులో వున్న కేసుల గురించి సంబంధిత అధికారులతో చర్చించారు. నెలకొకసారి సబ్ కలెక్టర్లు, ఆర్.డి.ఓ.లు
క్షేత్రస్థాయి కార్యాలయాల రికార్డులను తనిఖీ చేయాలన్నారు. కోర్టు కేసుల గురించి సకాలంలో స్పందించని తహసిల్దార్ల పై చర్యలు తీసుకోబడతాయన్నారు.ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టరు డా. వి.వినోద్ కుమార్, గూడూరు, కావలి సబ్ కలెక్టర్లు గోపాలకృష్ణ, శ్రీధర్ ,జిల్లా రెవెన్యూ అధికారి మల్లిఖార్జున, నెల్లూరు ఆర్.డి.ఓ. హుస్సేన్, నాయుడు పేట ఆర్.డి.ఓ. సరోజిని, ఆత్మకూరు ఆర్.డి.ఓ. ఉమాదేవి, కె.ఆర్.సి. డిప్యూటి కలెక్టరు దాసు తదితర అధికారులు పాల్గొన్నారు.