నెల్లూరులో కరోనా వైరస్ కలకలం సృష్ఠిస్తోంది. నగరంలోని చిన్నబజార్ కు చెందిన ఓ యువకుడికి కరోనా వైరస్ ఉందని నిర్ధారణ కావడంతో అధికారులు నగరంలో హై అలెర్ట్ ప్రకటించారు. ఇప్పటికే థియేటర్లను మూసివేయించిన జిల్లా కలెక్టర్ ఎమ్.వి. శేషగిరి బాబు శుక్రవారం మరో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 18వ తేదీ వరకూ నెల్లూరు నగరంతో పాటూ నెల్లూరు రూరల్ పరిధిలోని అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు సూళ్లకు శెలవులను ప్రకటించారు. కరోనాపై ఆందోళన చెందుతున్న విద్యార్ధుల తల్లిదండ్రుల విజ్ఞాపన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా జిల్లాలోని అన్నీ స్విమ్మింగ్ ఫూళ్లను కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్విమ్మింగ్ ఫూల్స్ ద్వారా కరోనా త్వరితగతిన వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 18వ తేదీ వరకూ స్కూళ్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు దానిపై ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్ధనాచార్యులు తెలియజేశారు.