నగర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక 19వ డివిజన్ ఆనం వెంకటరెడ్డి నగర్, తదితర ప్రాంతాల్లో జరుగుతున్న డ్రైను, రోడ్ల నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో కమిషనర్ ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మురుగు నీరు నిలిచిపోయి, దోమల వ్యాప్తికి కారణమవుతున్న స్థలాలను గుర్తించి త్వరితగతిన ఆయా ప్రాంతాలను శుభ్రం చేయాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. దోమల నివారణకు డ్రైను కాలువల్లో ఆయిల్ బాల్స్ వేయడంతో పాటుగా మురుగు ప్రాంతాల్లో ఫాగింగ్ ప్రక్రియ నిరంతరం చేపట్టాలని సూచించారు. డ్రైను కాలువల్లో పూడికతీత పనులతో పాటు మురుగు ప్రవాహానికి ఆటంకం లేకుండా అనునిత్యం పర్యవేక్షించాలని అధికారులకు కమిషనర్ సూచించారు. ఈ పర్యటనలో ఎస్.ఈ సంజయ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.