గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేసిన అంశంపై డీజీపీకి టీడీపీ చీఫ్ చంద్రబాబు లేఖ రాశారు. ఈ దాడులు ప్రణాళికాబద్ధంగానే జరుగుతున్నాయని, మహనీయుల విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే పోలీసులు అలసత్వం ప్రదర్శించడం తగదని అందులో పేర్కొన్నారు. వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చకొట్టే కుట్రలో భాగంగానే వైకాపా జడ్పీటీసీ సెట్టిపల్లి యలమంద ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు.

 ‘ఈ తరహా ఘటనలు పునరావృతమైతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. అధికార వైకాపా నాయకుల అండదండలతోనే ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో జూన్ 2019 నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే ప్రయత్నంలో అధికార పార్టీ గూండాలను ప్రోత్సహిస్తూ ఎన్టీఆర్, అంబేద్కర్ వంటి జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు’

 ‘శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవటం తగదు. ఇలాంటి విధ్వంసక చర్యలను మరింత విస్తరించకుండా నియంత్రించాలి. ఇలాంటి విధ్వంసాలను ప్రోత్సహించడంలో పోలీసులు నిందితులకు సహకరిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఫిర్యాదులపై విచారణ జరిపి దోషులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చూడాలి. పోలీసులు తీసుకునే కఠినమైన చర్యలు మాత్రమే నేరస్తులను నిరోధించగలవు’ అని లేఖలో అభిప్రాయపడ్డారు.