తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు నందరమూరి తారక రామారావు 24వ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు.. జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌, రామకృష్ణ, సుహాసిని, దగ్గుబాటి పురందరేశ్వరీ, ఆమె కుటుంబసభ్యులు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌ రమణ, ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రముఖ సినీ దర్శకులు వైవీఎస్‌ చౌదరి, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న తదితరులు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న మాట్లాడుతూ.. మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించిన మహానీయులు ఎన్టీఆర్‌ అన్నారు. ప్రస్తుతం మహిళపై జరుగుతున్న దాడులు చూసి ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ సారైనా ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు ప్రకటించి, గౌరవించాలని కోరుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. తెలుగువారికి గౌరవం తెచ్చిన నాయకుడు ఎన్టీర్‌ అని ఆయన పేర్కొన్నారు.