మళ్లీ పెరిగిన కేసులు..తాజాగా నమోదైన కేసులు ఎన్నంటే..?

98.07 శాతానికి చేరిన రికవరీ రేటు

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారీ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 18 వేలకు పైగా కేసులు, 200కు పైగా మరణాలు సంభవించాయి. గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ ఈ గణాంకాలను వెల్లడించింది.

బుధవారం 13,01,083 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,987 మందికి పాజిటివ్‌గా తేలింది. అంతక్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 16 శాతం పెరుగుదల కనిపించింది. నిన్న 19,808 మంది కరోనా నుంచి కోలుకున్నాను. ఇప్పటి వరకు 3.40 కోట్ల మందికిపైగా వైరస్ సోకగా.. వారిలో 3.33 కోట్ల మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.07 శాతానికి చేరింది.

ప్రస్తుతం క్రియాశీల కేసులు రెండు లక్షలకు చేరువలో కొనసాగుతున్నాయి. ఆ కేసుల సంఖ్య 2.06 లక్షలు(0.61 శాతం)గా ఉంది. నిన్న మరో 246 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 4,51,435 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.