ముగ్గురు యువకులు కలిసి.. ఇంకో యువకుణ్ని చెట్టుకు కట్టేశారు. నోటికొచ్చిన బూతులు తిడుతూ కర్రలు, బెల్టులతో కసితీరా కొట్టారు. మనుషులమన్న విచక్షణకూడా లేకుండా.. అతనిపై మూత్రం పోసి దారుణంగా అవమానించారు. పట్టపగలు తమ కండ్ల ముందే ఈ తతంగం జరుగుతున్నా చుట్టుపక్కలవాళ్లెవరూ పట్టించుకోలేదు.
కొన్ని గంటలుగా ఒడిశాలోని న్యూస్ చానెళ్లు, సోషల్ మీడియాలో ఓ వీడియో కలకలం రేపుతున్నది. మంచినీళ్లు అడిగిన పాపానికి ఓ యువకుణ్ని పట్టుకుని చితగొట్టి.. అతనిపై మూత్రం పోశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ ను ఆనుకుని ఉండే కోర్దా జిల్లాలో మొన్న బుధవారం చోటుచేసుకుందీ సంఘటన. దీనికి సంబంధించి వివరాలను పోలీసులు వెల్లడించారు.
కోర్దా జిల్లాలోని బందిగ గ్రామానికి చెందిన బాధిత యువకుడు మొన్న బుధవారం కైపాదార్ అనే ఊకెళ్లాడు. అక్కడ ఓ ఇంటిముందు నిలబడి నీళ్లు కావాలని అడినందుకే బాధితుడిపై దాడి జరిగినట్లు కొందరు చెబుతున్నారు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కోర్దా ఎస్పీ అజయ్ ప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి దాడికి పాల్పడిన ముగ్గురు యువకుల్లో ఒకర్ని పట్టుకున్నామని, ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు.

ప్రేమ వ్యవహారం అంటూ..
అయితే ప్రచారం జరుగుతున్నట్లుకాకుండా బాధితుడిపై దాడికి వేరే కారణం ఉన్నట్లూ కొన్ని వార్తలొచ్చాయి. సదరు బాధిత యువకుడు... కైపాదార్ కు వచ్చింది మంచినీళ్ల కోసం కాదని.. ఓ అమ్మాయి కోసమని, తమ గ్రామానికి చెందిన అమ్మాయిని వేధిస్తున్నాందుకే అతన్ని స్థానికులు పట్టుకుని తన్నారని కొందరు చెబుతున్నారు. అయితే కేసును తప్పుదారి పట్టించడానికే ప్రేమ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని, ఇది ముమ్మాటికీ వివక్షదాడేనని ఇంకొందరు అంటున్నారు.